- మున్సిపల్ చట్ట సవరణ, ప్రైవేట్ వర్సిటీస్,
- హెల్త్ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల రిటైర్మెంట్ ఏజ్ పెంపు,
- పంచాయతీరాజ్ సవరణ బిల్లులు మళ్లీ పాస్
- గురునానక్, శ్రీనిధి వర్సిటీల్లో రెండేండ్లు
- మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లు రద్దు: సబిత
హైదరాబాద్, వెలుగు: గవర్నర్ తిప్పిపంపిన బిల్లులకు శుక్రవారం అసెంబ్లీ మళ్లీ ఆమోదం తెలిపింది. వైద్య శాఖలో అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల రిటైర్మెంట్ ఏజ్‌ను ప్రొఫెసర్లతో సమానంగా 65 ఏండ్లకు పెంచే బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ యూనివర్సిటీస్బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు సభ ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రూల్స్‌కు విరుద్ధంగా అడ్మిషన్లు తీసుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేట్ వర్సిటీల్లో రెండేండ్ల పాటు మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లను రద్దు చేశామన్నారు. భద్రాచలంను ఒకే గ్రామ పంచాయతీగా ఉంచాలని ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, భద్రాచలంలో 60 వేలకు పైగా ప్రజలున్నారని, దానిని మున్సిపాలిటీగా చేద్దామంటే కేంద్ర చట్టం అడ్డుకుంటోందని.. అంత జనాభా ఉన్న భద్రాచలం ఒక్క గ్రామ పంచాయతీ చేస్తే ఇబ్బందులవుతాయి కాబట్టే భద్రాచలం, శాంతినగర్, సీతారాం నగర్ గ్రామ పంచాయతీలుగా విభజించామన్నారు. ఒక్కటే ఊరును మూడు ముక్కలు చేస్తే ప్రజలు నవ్వుతారని. అది మంచిది కాదని వీరయ్య అన్నారు. పీసా యాక్ట్ ను అతిక్రమించొద్దని, గ్రామ సభలు పెట్టి ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే విభజన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎర్రబెల్లి స్పందిస్తూ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాతే మూడు పంచాయతీలు చేయాలని నిర్ణయించామని తెలిపారు. గవర్నర్ తిప్పి పంపిన బిల్లులను అసెంబ్లీ మళ్లీ ఆమోదించి పంపుతోందని, వీటిని గవర్నర్ఆమోదించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలిపిన తర్వాత రాత్రి 10.20 గంటలకు సభ వాయిదా పడింది.
12 గంటలకు పైగా మారథాన్సెషన్
అసెంబ్లీ శుక్రవారం 12 గంటలకు పైగా కొనసాగింది. ఉదయం 10 గంటలకు క్వశ్చర్ అవర్‌తో సభ ప్రారంభించారు. జీరో అవర్తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు టీ బ్రేక్ ఇచ్చారు. పావు గంట తర్వాత సభ మళ్లీ ప్రారంభమైంది. వర్కింగ్ లంచ్తోనే సభ కొనసాగించారు. అసెంబ్లీలో వరదలు, విద్య, వైద్య శాఖలపై షార్ట్ డిస్కషన్నిర్వహించారు.