టీఎస్ఆర్టీసీ విలీన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశ పెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పువ్వాడ.. ఉద్యోగుల విలీనంతో ప్రభుత్వానికి ఏటా 3 వేల కోట్ల భారం పడుతుందన్నారు. ఆర్టీసీ ఆస్తులు కార్పొరేషన్ ఆధీనంలోనే ఉంటాయని చెప్పారు.
రెండు రోజుల తీవ్ర ఉత్కంఠ తర్వాత పలు అంశాలపై స్పష్టత తీసుకుని గవర్నర్ ఆర్టీసీ బిల్లుకు ఇవాళ(ఆగస్టు 6) మధ్యాహ్నం ఆమోదం తెలిపారు. తనకు ఎదురైన సందేహాలపై అధికారుల నుంచి వివరణ తీసుకున్న తర్వాత ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపుతూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది.
గద్దర్ కు అసెంబ్లీ సంతాపం
ప్రజాగాయకుడు గద్దర్ మృతిపట్ల అసెంబ్లీ సంతాపం తెలిపింది. గద్దర్ మృతి బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. గద్దర్ మరణం తీరని లోటని.. ఉద్యమ సమయంలోఆయనతో కలిసి పనిచేశామన్నారు. గద్దర్ తన పాటతో కోట్లాది మందిని ఉత్తేజ పరిచారని చెప్పారు. అనంతరం సభను నిరవధిక వాయిదా వేశారు స్పీకర్.