
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల
హైదరాబాద్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీసీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ చట్టం చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ కు జాజుల కృతజ్ఞతలు తెలిపారు. బీసీ బిల్లు ఆమోదం పొందడం అభినందనీయమన్నారు.
అలాగే, బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ పార్టీల నేతలకూ బీసీ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. బీసీ బిల్లు ఆమోదం తదుపరి అమలు కోసం ఢిల్లీ కేంద్రంగా జరిగే పోరాటంపైన అన్ని రాజకీయ పార్టీలు కలిసి రావాలని ఆయన కోరారు.