11 రోజులు.. 12 బిల్లులు.. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

11 రోజులు.. 12 బిల్లులు.. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గురువారం ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ఈ నెల 12న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, మొత్తం 11 రోజుల పాటు 97 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగినట్టు ఆయన వెల్లడించారు. బీసీలు, ఎస్సీలు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న రెండు చారిత్రక బిల్లులకు ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం  రిజర్వేషన్లు కల్పించే బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు సహా మొత్తం 12 బిల్లులను సభ ఆమోదించింది.డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయడంతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రవేశపెట్టిన రెండు తీర్మానాలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

అర్ధరాత్రి దాకా చర్చలు.. 

ఈ నెల 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్​జిష్ణుదేవ్​వర్మ ప్రసంగించారు. 13, 15 తేదీల్లో గవర్నర్​ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. 17,18 తేదీల్లో బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులపై చర్చ అనంతరం బిల్లులకు ఆమోదముద్ర వేశారు. 19న అసెంబ్లీలో ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి బడ్జెట్​ ప్రవేశపెట్టగా.. 21 నుంచి 26 వరకు బడ్జెట్‌‌‌‌‌‌‌‌పై చర్చ జరిగింది. గురువారం ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చించి, ఆమోదించడంతో పాటు డీలిమిటేషన్‌‌‌‌‌‌‌‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఈసారి బడ్జెట్​సమావేశాలు వాడీవేడిగా జరిగాయి. అర్ధరాత్రి దాకా చర్చలు కొనసాగాయి. కాగా, ఈసారి సభకు హాజరుకాకపోతే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం ఉండడంతో మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 12న  గవర్నర్ ప్రసంగానికి​హాజరయ్యారు. ఇక ఆ తర్వాత సెషన్ ​మొత్తానికి గైర్హాజరయ్యారు. మరోవైపు ఈ నెల 13న గవర్నర్  ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్​సభ్యుడు జగదీశ్​రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది.  

  • సమావేశాలు జరిగిన రోజులు11
  • పని గంటలు 97 గం.32 ని.
  • ఆమోదం పొందిన బిల్లులు 12
  • మొత్తం ప్రసంగాలు 146
  • అసెంబ్లీ చేసిన తీర్మానాలు 3