ప్రజలే నిర్ణేతలు..మరో అరు నెలల్లో ఎన్నికలు

ఇవాళ నా దగ్గర బంగళాలున్నాయి, ఆస్తులున్నాయి, బ్యాంక్‌‌ బ్యాలెన్స్‌‌ ఉంది, భవంతీ ఉంది, బండ్లున్నాయి... నీ దగ్గిరేముంది..?’ అని ‘దివార్‌‌’ సినిమాలో అమితాబచ్చన్‌‌ గర్వోద్రేకంతో అడుగుతుంటే, శశికపూర్‌‌ కూల్‌‌గా ‘నా దగ్గర అమ్మ ఉంది’ అని బదులిస్తాడు. అలాగే మా దగ్గర ‘కేసీఆర్‌‌’ ఉన్నాడు, మీ దగ్గర ఏముంది..?’ అని బీఆర్‌‌ఎస్‌‌ నాయకులు, కార్యకర్తల శ్రేణులు ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్‌‌, బీజేపీలను ప్రశ్నిస్తున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ను వ్యూహాల్లో, ఎత్తుగడల్లో, మాటకారితనంలో మరే దాంట్లోనూ ఎదుర్కోగల స్థాయి ప్రత్యర్థి పార్టీల్లో ఎవరికీ లేదు. అందుకే పోరాట వ్యూహాల్లో సదా వెనకబడుతున్నారు. ఈ ప్రయాణంలోనే... రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆరుమాసాల గడువులోకొచ్చేశాయి.

నాలుగు దశాబ్దాల కింద కాంగ్రెస్‌‌ పార్టీలో ఉండి, అప్పుడప్పుడే పుట్టిన బీజేపీని ఎదిరిస్తున్న నాటి నుంచే కేసీఆర్‌‌ యువ రాజకీయ కార్యకర్తగా వ్యూహాల్లో దిట్ట. తర్వాత యువజన కాంగ్రెస్‌‌ నుంచి టీడీపీలోకి మారి సుదీర్ఘ ప్రయాణం చేశారు. రెండు దశాబ్దాల కింద టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని శీర్షభాగాన ఉండి నడిపారు. దాన్నిపుడు బీఆర్‌‌ఎస్‌‌గా మార్చి ఆ రెండు పార్టీలు కాంగ్రెస్‌‌, బీజేపీలను జాతీయ స్థాయిలో ఢీకొనే వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. బీజేపీ, కాంగ్రెస్‌‌ కాని ప్రత్యామ్నాయ పాలన భారతదేశానికి కావాలని కాలికి బలపం కట్టుకొని తిరుగుతున్నారు. మరోవైపు, రాష్ట్రంలో కాంగ్రెస్‌‌, బీజేపీలు ఆయన ఎత్తుడగలు, వ్యూహాల దాటికి తట్టుకోలేకపోతున్నాయి. ఆ పార్టీలు ఎన్నికలు సమీపిస్తున్నా బిత్తరపోయి దీనపు దిక్కులు చూస్తున్నాయి.

ప్రధాన ప్రత్యర్థి ఆయన నిర్ణయమేనా..?

రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థిగా ఎవరుండాలో పాలకపక్షంగా బీఆర్‌‌ఎస్‌‌ నిర్ణయంచాలన్నట్టు కేసీఆర్‌‌ ఆలోచిస్తున్నారు. అందుకే, ఎప్పుడు బీజేపీని పైకెత్తాలి? ఎప్పుడు కిందకు దించి కాంగ్రెస్‌‌ను ఎత్తాలో తన ఇష్టమే అన్నట్టు సంకేతాలిస్తుంటారు. ఇనాళ్లు బీజేపీపై విమర్శనాస్త్రాలు సంధించి, ఇప్పుడు ఉన్నట్టుండి కాంగ్రెస్‌‌పై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ తనకు ప్రధాన ప్రత్యర్థి అన్న సంకేతాలిస్తున్నారు. ఎందుకంటే, బీజేపీ మరీ అడుగున పడిపోవడం కూడా ఆయనకు ఇష్టం ఉండదు. అలా జరిగితే తనకిక కాంగ్రెస్‌‌తో ముఖాముఖి పోరు అవుతుంది. అది ప్రమాదకరం. కమ్యూనిస్టులను ఎలాగూ తనతో జతకూర్చుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌‌లు సమస్థాయిలోనో, కొంచెం హెచ్చుతగ్గులుగానో ఉండి బహుముఖ పోటీలో ఉంటేనే తన పని తేలికని కేసీఆర్‌‌ యోచిస్తారు.

కర్నాటక స్ఫూర్తి కదలిక తేలే

కాంగ్రెస్‌‌ పార్టీలో ఉన్న జబ్బేంటో ఒక్క కాంగ్రెస్‌‌ వారికి తప్ప అందరికీ తెలుస్తుంది. కర్నాటకలో గెలుపు తర్వాత కూడా రాష్ట్రంలో కాంగ్రెస్‌‌కు ఆశించిన స్థాయిలో ఊపురావట్లేదు. ‘అదేం లేదు, పార్టీ ఎంతో పుంజుకుంటోంది. కానీ, మీడియా విపరీత ధోరణి, ఖరారైన స్థిర భావనల వల్ల తగిన ప్రచారం దొరక్క కాంగ్రెస్‌‌ అలా కనిపిస్తోంది’ అనే వారూ ఉన్నారు. కర్నాటకలాగా కాంగ్రెస్‌‌ మెరుగవడానికి ఇక్కడ 40 శాతం ప్రజాదరణ కలిగిన సిద్ధరామయ్యలే కాదు. పార్టీ ప్రయోజనాల కోసం రాజీపడే డైనమిక్‌‌ డీకే శివకుమార్‌‌లూ లేరు. ఉన్నదంతా ఒకరి కాళ్లు ఒకరు లాగే పీతల వంటి నాయకులే! తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌‌ 2014లో 25.2 శాతం ఓట్లు సంపాదిస్తే 2018లో ప్రధాన ప్రతిపక్షంగా సాధించింది 28.4 శాతం ఓట్లు మాత్రమే! అఖిల భారత స్థాయిలో ఇప్పుడు తానున్న స్థానం, పరిస్థితిని బట్టి రాష్ట్రంలో ఇతర పార్టీలతో పొత్తులకో, తమతో సయోధ్యకో యత్నించవచ్చు. ఆ అవకాశమున్న కమ్యూనిస్టులు ఎలాగూ చేజారి పోయారు. పాలక పక్షం పంచన చేరారు. ఇక ఉన్నది బీఎస్పీ, టీజేఎస్‌‌, వైఎస్‌‌ఆర్‌‌టీపీ వంటి పార్టీలు. 

వాటితో కాంగ్రెస్‌‌ మాట్లాడుకోవచ్చు. కొత్తగా పార్టీ ఏర్పాటు చేస్తామంటున్న ఆయా పార్టీల్లోని అసంతృప్తి నేతలతో విడిగానో, ఒక బృందంగానో చేతులు కలపొచ్చు. కానీ, పార్టీలో ఉన్న సీనియర్లు, జూనియర్లు, మైగ్రెంట్లు.. ఇలా అందరినీ ఒకతాటిపైకి తేవడమే ఒక యుద్ధం! ఇక బయటి వారితో సయోధ్య చర్చలకు సమయమెక్కడ? జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు గత కొన్ని రోజులుగా అమెరికాలో కష్టపడుతున్న తీరు చూస్తే, ఎన్‌‌ఆర్‌‌ఐలకు ఓటు హక్కు కల్పిస్తే కాంగ్రెస్‌‌ గెలుపు అవకాశాలు మెరుగవుతాయేమో? దేశమంతా పోటీ చేసే మజ్లీస్‌‌ (ఎంఐఎం) రాష్ట్రంలో హైదరాబాద్‌‌ తప్ప బయట పోటీ చేయకుండా చూడటం కేసీఆర్‌‌ వ్యూహ విజయం. 

యూపీలో అప్నాదళ్‌‌ వంటి చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకునే బీజేపీ, కేరళలో ముస్లింలీగ్‌‌ వంటి పార్టీలతో సయోధ్య నెరిపే కాంగ్రెస్‌‌ రాష్ట్రంలో బహుముఖ పోటీ పరిస్థితిని చూస్తూ ఉండటం వ్యూహ లోపం! 2018లో మంత్రులతోపాటు పాలక పక్ష ఎమ్మెల్యేలు పలువురిపై వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉన్నా వ్యూహాత్మకంగా కేసీఆర్‌‌ తనను చూసి ఓటేయాలని ప్రజలను కోరి అధికుల్ని గెలిపించుకున్నారు. అలాంటి వ్యూహకర్తతో పాటు, అధికారం, ఆర్థిక వనరులు, అంగబలం, పథకాల బలం అన్నీ తమవద్దే ఉన్నాయంటూ.... ‘మీ దగ్గర ఏముంది?’ అని అడిగే పాలకపక్షీయులకు శశికపూర్‌‌ ‘దివార్‌‌’లో చెప్పినట్టు ‘ప్రజామద్దతు’ అని విపక్షం చెప్పగలదా?

బహుముఖ పోటీల్లో బలపడేదెవరు..?

కిందటి ఎన్నికల్లో బహుజన సమాజ్‌‌ పార్టీ (బీఎస్పీ)కి 2.1 శాతం ఓట్లు వచ్చాయి. ఆర్‌‌.ఎస్‌‌.ప్రవీణ్‌‌ కుమార్‌‌ రూపంలో ఇప్పుడు దానికొక ‘ఫేస్‌‌’ దొరికింది. వైఎస్‌‌.రాజశేఖర్‌‌రెడ్డిని అభిమానించే ‘బల(గ)ం’ నమ్ముకొని కొత్తగా వైఎస్‌‌ఆర్‌‌టీపీ పేరుతో షర్మిల కూడా 
ఈ సారి రంగంలో ఉన్నారు. కోదండరామ్‌‌ నేతృత్వంలో తెలంగాణ జనసమితి (టీజేఎస్‌‌) బరిలో ఉంటుంది. పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కొండా విశ్వేశ్వర్‌‌రెడ్డి లాంటి ‘ధిక్కార స్వరాలు’ ఒక దళంగా ఏర్పడటానికి ఉవ్విళ్లూరుతున్నాయి. తెలుగుదేశం ఏం చేస్తుందో ఇంకా నిర్ణయం కాలేదు. ఇలా వివిధ పార్టీలు వేర్వేరు పార్శ్వాల నుంచి దిగుతూ బహుముఖ పోటీ చిత్రాన్ని ఆవిష్కరించడం వల్ల ఎవరికి లాభం? ఏ రకంగా చూసినా అది పాలక బీఆర్‌‌ఎస్‌‌కు లాభించేదే! కిందటి 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ - తెలుగుదేశం - సీపీఐలు ఒక ప్రజా కూటమిగా ఏర్పడి.. సీపీఎం కొన్ని ఇతర పార్టీలను కలుపుకొని బహుజన లెఫ్ట్‌‌ ఫ్రంట్‌‌గా పోరాడింది. బీజేపీ, బీఎస్పీలు విడిగా పోటీ చేశాయి. టీజేఎస్‌‌ బరిలో ఉంది. ఇలా బహుముఖ పోటీలు పాలక పక్షానికి మేలు చేశాయి. వారు 46.9 శాతం ఓట్లతో అధికారం నిలబెట్టుకోగలిగారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే లాభం ఎప్పుడైనా అధికార పక్షానికే.

‘క్లూలెస్‌‌’గా బీజేపీ నాయకత్వం

2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీ సాధించింది 7 శాతం ఓట్లు మాత్రమే. గెలిచిన 5 సీట్లు కూడా ‘గ్రేటర్‌‌’ పరిధిలోవే! ఇక 2018లో ఒంటరిగా పోటీ చేసి కూడా సాధించింది 7.1 శాతం ఓట్లే. అంటే పెరిగిందేమీ లేదు. పైగా నెగ్గింది ఒక స్థానమే! మోడీ హవా దేశమంతా మారుమోగుతున్నప్పుడు అదీ పరిస్థితి. తర్వాత 2019లో జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో ఏకంగా నాలుగు స్థానాల్లో గెలవటం వారికి అనూహ్య విజయం. ఆ తర్వాత అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 2 చోట్ల గెలవడం, ఒకచోట అతి సమీపంగా రావడం, హైదరాబాద్‌‌ మహానగర ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలు గెలవటం పార్టీకి ఊపుతెచ్చింది. కానీ, కారణాలేవైనా పార్టీ మరింత ఊపుదిశగా సాగటం లేదు. కర్నాటకలో పార్టీ ఓటమి తర్వాత ఇంకా చతికిలపడింది. మొదటి నుంచీ బీజేపీ కేంద్ర నాయకత్వం ఎంత ప్రోత్సాహం ఇచ్చి టార్గెట్లు పెడుతున్నా రాష్ట్రంలో పార్టీ ఆశించిన స్థాయిలో ఎదగడం లేదు. నాయకుల మధ్య పెద్దగా సఖ్యత రాలేదు. పాతవారు హాయిగా లేరు. ఇంతకాలం నిరీక్షించిన ‘చేరికల’ సంగతేమోగానీ, వచ్చిన వారు వెళ్లిపోయే ‘తిరోగమనాలు’ లేకుండా చూసుకుంటే గొప్ప అన్న పరిస్థితి ఉంది. ఈ దశలో ఏమి చేయాలో పార్టీ ఢిల్లీ నాయకత్వానికీ పాలుపోని పరిస్థితి నెలకొని ఉంది.

- దిలీప్‌‌ రెడ్డి, పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ,