జడ్చర్ల టౌన్/మక్తల్/పాలమూరు/చిన్నచింతకుంట/నారాయణపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 96 నామినేషన్లు దాఖలయ్యాయి. దేవరకద్ర అసెంబ్లీ స్థానానికి 16 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు ఏడు నామినేషన్లు వచ్చాయి. మహబూబ్‌నగర్ అసెంబ్లీ స్థానానికి 43 నామినేషన్లు దాఖలు చేయగా, చివరి రోజు 21 నామినేషన్లు వచ్చాయి. జడ్చర్లలో 37 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు 20 నామినేషన్లు వేశారు. నారాయణపేట స్థానానికి మొత్తం 19 నామినేషన్లు దాఖలు కాగా, చివరి రోజు 9 నామినేషన్లు వేశారు. నామినేషన్లకు చివరి రోజు కావడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు పోటాపోటీగా రెండు, మూడు సెట్ల నామినేషన్లు వేశారు.
చివరి రోజు మహబూబ్‌నగర్ నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ క్యాండిడేట్ మిథున్‌రెడ్డి తరఫున ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి, బీఎస్పీ నుంచి స్వప్న శ్రీనివాసులు, అలాగే మెట్టుకాడి శ్రీనివాసులు, మున్నూరు రవి, జడ్చర్ల నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ జనంపల్లి అనిరుధ్‌రెడ్డి, ఆయన తల్లి జనంపల్లి శశికళ, దేవరకద్ర నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్ జి.మధుసుదన్‌రెడ్డి (జీఎంఆర్), బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తరఫున ఆయన కుమార్తె, మక్తల్ స్థానం నుంచి బీజేపీ క్యాండిడేట్ జలంధర్‌రెడ్డి, వాకిటి శ్రీహరి నామినేషన్లు వేశారు.
నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్‌లో శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి డా.కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి తరఫున ఆయన తండ్రి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. జనసేన నుంచి వంగా లక్ష్మణ్ గౌడ్, బీజేపీ రెబల్స్‌గా కొండ మణెమ్మ, సుధాకర్‌రెడ్డి నామినేషన్లువేశారు. జిల్లా వ్యాప్తంగా 115 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగర్ కర్నూల్లో 47, కొల్లాపూర్‌లో 33, అచ్చంపేటలో 35, కల్వకుర్తిలో 52 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
గద్వాల: గద్వాలలో శుక్రవారం 20 నామినేషన్లు దాఖలు కాగా, ఇప్పటివరకు 32 మంది నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి అపూర్వ్ చౌహాన్ తెలిపారు. అలంపూర్ లో చివరి రోజు16 మంది నామినేషన్లు రాగా, 47 నామినేషన్లు దాఖలయ్యాయి.
ALSO READ: సీనియర్లు వర్సెస్ సిట్టింగులు.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నడుమ హోరాహోరీ
వనపర్తి: వనపర్తి అసెంబ్లీకి చివరి రోజు 15 సెట్ల నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి ఎస్. తిరుపతి రావు తెలిపారు. బీజేపీ అభ్యర్థిగా అనుజ్ఞ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నిరంజన్ రెడ్డి తరపున ప్రపోజర్స్ నాలుగో సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి మొదటి రోజు నామినేషన్ వేసినప్పటికీ మాజీ మంత్రి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవితో కలిసి మరో సెట్ అందజేశారు.