వీడియో తీయ్.. ఫార్వర్డ్ చెయ్ !

  •     బూత్ స్థాయి ఓటర్లపై అభ్యర్థుల నజర్
  •     తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు 
  •     లోకల్ యూత్​తో సోషల్ మీడియా టీమ్​లు 
  •     అభివృద్ధి, సమస్యలే ప్రధానంగా వీడియోలు 
  •     వాటిని గ్రూప్​లకు, పర్సనల్​గా పంపిస్తూ వైరల్ 
  •     ఓటర్లకు దగ్గర అవొచ్చని భావిస్తున్న క్యాండిడేట్లు

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ​తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతున్నది. ఓటర్లకు దగ్గరయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా బూత్​స్థాయి నుంచి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ప్రత్యేకంగా సోషల్ మీడియా టీమ్​లను నియమించుకుంటున్నారు. ఇప్పటికే కొందరు అభ్యర్థులు వర్క్ ప్రారంభించారు. వీరిని చూసి మరికొందరు అభ్యర్థులు రెడీ అవుతున్నారు.

సభ్యులుగా  స్థానికులనే నియమించుకుంటున్నారు. బూత్​ పరిధిలోని ఓటరు నాడీని తెలుసుకుంటున్నారు. ఇదివరకు గ్రామ, మండల స్థాయి వరకే సోషల్ మీడియా టీమ్​లు ఉండేవి. ఇప్పడు కొత్తగా బూత్ స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఓటర్లను ప్రభావితం చేయడం ఈజీ అవుతుందని పలువురు అభ్యర్థులు భావిస్తున్నారు.    

టీమ్స్​లో ఎవరుంటారంటే...

బూత్ స్థాయి సోషల్ మీడియా  టీమ్స్​లో  స్థానికంగా చురుగ్గా ఉండే యువతనే సభ్యులుగా తీసుకుంటున్నారు. వారికి ఆకర్షణీయమైన శాలరీలు ఇవ్వడంతో పాటు మంచి కెమెరా ఉన్న సెల్​ ఫోన్​ను అభ్యర్థులే కొనిస్తున్నారు. ప్రచారంలో భాగంగా అప్పటికప్పుడే చిన్న వీడియోలను ఎలా ఎడిట్ చేయాలో కూడా నేర్పిస్తున్నారు. స్థానికంగా తెలిసిన వారే ఉంటారు కాబట్టి, ఒక బూత్​లో ఎవరెవరు ఏయే పార్టీ వైపు అనేది సులభంగా గుర్తిస్తున్నారు.

ఇతర పార్టీలకు చెందిన వారిని, వారి అవసరాలను బట్టి  ప్రలోభాలతో మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.  అయితే, ఈ టీమ్​లపై ఎప్పటికప్పుడు ఇన్​చార్జిల మానిటరింగ్ ఉంటుంది. రోజూ ఏయే కార్యక్రమాలు చేస్తున్నారు. రిజల్ట్ ఏంటి అని పర్యవేక్షిస్తుంటారు. అవసరమైతే  ఈ టీమ్​లకు సలహాలు, సూచనలు కూడా ఇస్తుంటారు.  

సోషల్ మీడియా ద్వారా.. 

 ఒక బూత్​ పరిధిలో 800 మంది ఓటర్లు ఉంటే అందులో దాదాపు 500 మందికి వాట్సాప్ ఉంటుంది. అందులో యువత ఉంటే ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ , షేర్ చాట్, యూ ట్యూబ్ లాంటి యాప్​లను వాడుతుంటారు.  ఈ టీమ్​లు అభ్యర్థులను హైలెట్ చేస్తూ వీడియోలు, పోస్టులను రిలీజ్ చేస్తున్నాయి. సమస్యలపై చేసిన వీడియోలను ఓటర్లకు వ్యక్తిగతంగా పంపడం, విలేజ్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేయడం చేస్తున్నారు. అవసరమైతే బూత్ ఓటర్లకు ప్రత్యేకంగా ఓ గ్రూప్​ను క్రియేట్ చేస్తున్నారు. సిట్టింగ్ అభ్యర్థుల టీమ్​లు అయితే.. ప్రభుత్వ పథకాలు

ALSO READ : ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తీర్చినం .. ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌‌

అభివృద్ధిని హైలైట్ చేస్తూ వీడియోలను రూపొందిస్తున్నాయి. అయితే, ఇక్కడ అభ్యర్థులందరూ ఎక్కువశాతం  పార్టీ కార్యకర్తలు, తమకు అనుకూలంగా ఉండే వ్యక్తులతోనే అభిప్రాయ వీడియోలను రికార్డ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఇవి మంచి ఫలితాలను ఇస్తుండటంతో మరికొందరు అభ్యర్థులు కూడా బూత్ స్థాయి సోషల్ మీడియా టీమ్​లను  నియమించుకుంటున్నారు.