లీడర్లకు టికెట్ల ఫికర్​

లీడర్లకు టికెట్ల ఫికర్​
  • పబ్లిక్​లో తిరిగే వారికే అంటున్న హైకమాండ్లు, సెగ్మెంట్ల బాటలో లీడర్లు

  •  నియోజకవర్గాలను చుట్టేస్తున్న ఆశావహులు

  • బీజేపీ, కాంగ్రెస్​లోనూ టికెట్ల కోసం పోటాపోటీ

మహబూబ్​నగర్, వెలుగు:అసెంబ్లీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుండడంతో లీడర్లకు టికెట్ల ఫికర్​ పట్టుకుంది. ప్రజలతో ఎక్కువగా ఇంటరాక్షన్ అయ్యే వారికే టికెట్లు ఇస్తామని ప్రధాన పార్టీల హైకమాండ్లు స్పష్టం చేయడంతో, లీడర్లు పబ్లిక్​కు దగ్గరయ్యే ప్రయత్నాలు షురూ చేశారు. ఈ క్రమంలో గతంలో ఎడ మొహం, పెడ మొహంగా ఉన్న లీడర్లు కార్యకర్తలను కూడా కలుపుకుంటూ ప్రజల మధ్యకు వెళ్తున్నారు. 

బీఆర్​ఎస్​లో ముగ్గురికి సీట్లు ఓకే..

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ గతంలో పాలమూరులో పర్యటించి వచ్చే ఎన్నికల్లో మంత్రి వి.శ్రీనివాస్​గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్​రెడ్డి, తాజాగా జడ్చర్లలో జరిగిన సభలో మాజీ మంత్రి, సిట్టింగ్​ ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డిని తిరిగి గెలిపించుకోవాలని, పరోక్షంగా టికెట్లు వారికే అన్నట్లు మాట్లాడారు. వనపర్తి నియోజకవర్గంలో కొద్ది రోజుల కింద మంత్రి నిరంజన్​రెడ్డి, జడ్పీ చైర్మన్​ మధ్య విబేధాలు ఉండగా, అవి సమిసిపోయాయి. మిగిలిన 10 నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్​ సర్వే రిపోర్టుల ఆధారంగా టికెట్లు ఖాయం చేస్తారనే చర్చ జరుగుతోంది. ఈ సర్వేలు ఎలా ఉన్నా..  ప్రస్తుతం సిట్టింగులు ఉన్న అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్​కర్నూల్, మక్తల్, షాద్​నగర్​, గద్వాల, అలంపూర్​ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం సెకండ్​​కేడర్​ కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే వర్కటం జగన్నాథ్​రెడ్డి, సరిత తిరుపతయ్య, చిత్తరంజన్​దాస్​, మందా శ్రీనాథ్, కూచకళ్ల దామోదర్​రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, పి.భరత్  పబ్లిక్​లో తిరుగుతున్నారు. చాన్స్​ వస్తే అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారు. 

ఫస్ట్, సెంకడ్​ లీడర్ల మధ్య పంచాది

ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్​లో ఆశావహుల సంఖ్య పెద్దగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఫస్ట్, సెకండ్​ కేడర్​ లీడర్ల మధ్య టికెట్ల పంచాది నడుస్తోంది. అయితే, ఇప్పటికే అచ్చంపేట, కొడంగల్, వనపర్తి, నాగర్​కర్నూల్, అలంపూర్, కల్వకుర్తి నియోజవర్గాలకు సంబంధించి టికెట్లను హైకమాండ్  సూచనప్రాయంగా ఖాయం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ, దేవరకద్రలో ఇద్దరు, జడ్చర్లలో ఇద్దరు, మక్తల్​లో నలుగురు, కొల్లాపూర్​లో ఇద్దరు పోటీకి రెడీ అవుతున్నారు. ఇందులో కొందరు పబ్లిక్​లో తిరగకుండానే టికెట్లు ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లా మీదుగా ఆ పార్టీ నేషనల్​ లీడర్ రాహుల్​ గాంధీ చేపట్టిన ‘భారత్​ జోడో’ యాత్ర సాగినా.. అందులో పాల్గొనని లీడర్లు కూడా ప్రస్తుతం పార్టీ నుంచి బీ ఫామ్​ తమకే వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. 

గ్రామ స్థాయి నుంచి బీజేపీ..

బీజేపీ లీడర్లు గ్రామ స్థాయి నుంచి ఓటర్లను కలిసేందుకు ఊరూరా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే టాక్​ ఉండగా, కొద్ది రోజులుగా ఆమె ఈ నియోజకవర్గంపై స్పెషల్​ ఫోకస్​ పెట్టారు. ఈ క్రమంలో నిత్యం గద్వాలలో పర్యటనలు చేస్తున్నారు. పాలమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి పోటీ చేస్తారనే చర్చ సాగుతున్నా.. బీసీ లీడర్​ ఎన్పీ వెంకటేశ్  మాత్రం కార్యక్రమాలను స్పీడప్​ చేస్తున్నారు. నారాయణపేటలో సత్యయాదవ్​, మక్తల్​లో జలంధర్​రెడ్డి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రజల్లో తిరుగుతున్నారు. దేవరకద్రలో మాత్రం టికెట్​ కోసం డోకూరు పవన్​కుమార్​రెడ్డి, ఎగ్గని నర్సింహులు, దేవరకద్ర బాలన్నలు ప్రయత్నాలు చేస్తున్నారు. కల్వకుర్తి నుంచి ఆచారి మళ్లీ పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. షాద్​నగర్​లో మాత్రం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్​రెడ్డి తనయుడు మిథున్​రెడ్డి, అందె బాబయ్య, శ్రీనివాస్​రెడ్డి పోటీ పడుతున్నారు.