టికెట్లు కన్ఫం కాకముందే కాంగ్రెస్ ఆశావహుల ప్రచారం

  • తమకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ‌‌‌‌ఇచ్చిందని ఇంటింటికీ వెళ్లి ఓట్ల అభ్యర్థన
  • కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై జనంలోకి
  • టికెట్  వస్తుందన్న నమ్మకం లేనోళ్లు హైదరాబాద్, ఢిల్లీ నేతల చుట్టూ ప్రదక్షిణలు


కరీంనగర్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన కాంగ్రెస్  అభ్యర్థుల జాబితా ఇంకా ఖరారు కాకముందే కొందరు ఆశావహులు ప్రచారం మొదలుపెట్టేశారు. వాల్ రైటింగ్స్ తోపాటు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్  ప్రకటించిన ఆరు గ్యారంటీలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. ఈసారి తమకే టికెట్ వస్తుందని, ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాల టికెట్ల కోసం 85 మంది పోటీ పడుతున్నప్పటికీ ఎవరికి వారు తమకే టికెట్ అంటూ ప్రచారం చేసుకుంటుండడంతో క్యాడర్ కన్ఫ్యూజ్  అవుతున్నారు. అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించక ముందే తిరగడం ఎందుకని చాలా మంది కార్యకర్తలు లీడర్ల ప్రచారానికి వెళ్లడం లేదు. 

మరో ఐదారు రోజుల్లో కాంగ్రెస్  ఫస్ట్ లిస్ట్

మరో ఐదారు రోజుల్లో కాంగ్రెస్ తొలిజాబితా ప్రకటించే అవకాశముండగా.. ఇప్పటికే పలువురు లీడర్లు ఎలక్షన్  క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అనుచర వర్గం ఉన్న లీడర్లు మాత్రమే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఊరూరా తిరుగుతూ కార్యకర్తలతో సమావేశం అవుతున్నారు. కరీంనగర్ లో కొత్త జయపాల్‌‌‌‌ రెడ్డి, చొప్పదండిలో కాంగ్రెస్ ఇన్ చార్జి మేడిపల్లి సత్యం, మానకొండూరులో డీసీసీ ప్రెసిడెంట్  డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, పెద్దపల్లిలో విజయరమణారావు, ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ కుమార్, వేములవాడలో ఆది శ్రీనివాస్, సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి, రామగుండంలో మక్కాన్  సింగ్  రాజ్ ఠాకూర్  ప్రచారం ప్రారంభించారు. వీరంతా ఎలాగూ తమకే టికెట్ వస్తుందన్న ధీమాతో ఉన్నారు. జగిత్యాల నుంచి పోటీ చేయనున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు టికెట్ విషయంలో పెద్దగా పోటీ లేనప్పటికీ వారు పార్టీ పనుల్లో బిజీగా ఉండడంతో తమ నియోజకవర్గంపై ఇంకా పూర్తిగా ఫోకస్  పెట్టలేదు. 

వేచిచూసే ధోరణితో మరికొందరు

టికెట్ ఆశిస్తున్న వారిలో చాలా మంది తమ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. పార్టీ టికెట్లు ప్రకటించక ముందే ఖర్చు ఎందుకనే ధోరణితో ఉన్నట్లు తెలుస్తోంది. హుస్నాబాద్  టికెట్ ఆశిస్తున్న ప్రవీణ్ రెడ్డి గతంలో ఊరూరా తిరుగుతూ కార్యకర్తల సమావేశాలు నిర్వహించినా  మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్  ఎంట్రీ తర్వాత వెనక్కి తగ్గారు. టికెట్  కన్ఫం అయ్యాకే ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. కరీంనగర్ టికెట్  తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్న మేనేని రోహిత్ రావుకు పార్టీలో కొత్త లీడర్ల చేరికతో పోటీ పెరిగింది.

 తనకు టికెట్  కన్ఫం అయిందంటూ కొత్త జయపాల్ రెడ్డి రెండు రోజుల క్రితమే ఇంటింటి ప్రచారం మొదలుపెట్టగా.. రోహిత్ రావు టికెట్  కోసం హైదరాబాద్, ఢిల్లీలో అగ్రనేతల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్లు ప్రకటించే వరకు ఆయన కరీంనగర్  వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్  పార్టీ టౌన్  ప్రెసిడెంట్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  పద్మాకర్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కోరుట్లలో కాంగ్రెస్ ఆశావహులు ఎవరూ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. హుజూరాబాద్ లోనూ బల్మూరి వెంకట్ గానీ, ఇతర అభ్యర్థులుగానీ ఎలాంటి ప్రచారం నిర్వహించడం లేదు. తాజాగా ఈ నియోజకవర్గంలో వొడితెల ప్రణవ్  పేరు తెరపైకి రావడంతో టికెట్ విషయంలో ఉత్కంఠ నెలకొంది.