డిసెంబర్​ 7 లోపే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు!

  • అధికార యంత్రాంగం రెడీగా ఉండాలి
  • అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఈసీ బృందం
  • ప్రజలు ఓటింగ్​లో పాల్గొనేలా చూడాలని సూచన

హైదరాబాద్​, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా రెడీగా ఉండాలని ఈసీ బృందం స్పష్టం చేసింది. టైం ప్రకారం ఎన్నికలకు రెడీగా ఉండాలని చెప్పడంతో ఇంకో ఐదు నెలల్లోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరుపుతామని ఈసీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. గత ఎన్నికల కంటే ముందే అంటే డిసెంబర్​7వ తేదీలోపే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై  ఢిల్లీ నుంచి  సీనియర్​ డిప్యూటీ ఎలక్షన్​ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, ఆర్కే గుప్తా, సంజయ్​ కుమార్, అండర్​ సెక్రటరీ అవినాష్​​ కుమార్, ప్రిన్సిపల్​ సెక్రటరీ హిర్దేశ్​ కుమార్, ఇతర డిప్యూటీ కమిషనర్లతో ఈసీ బృందం మూడు రోజుల కిందట హైదరాబాద్​కు వచ్చింది. 

వరుసగా ఐటీ, జీఎస్టీ, సీఎస్, డీజీపీ,  పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ సెక్రటరీలు, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రెండు రోజుల పాటు ఆ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా ఎన్నికల సన్నద్ధతపై అధికారులు చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పలు సూచనలు చేశారు. ఈసీ కొత్తగా తీసుకువచ్చిన టెక్నాలజీ అప్లికేషన్లు ఎలా వాడాలో అవగాహన కల్పించారు. ఓటర్ల జాబితా, షెడ్యూల్​ తరువాత ఎన్నికల కోడ్, నోటిఫికేషన్, నామినేషన్లు, అభ్యర్థులు, పార్టీల ఖర్చులు, కోడ్​ ఉల్లంఘనలు, నగదు పంపిణీ, లిక్కర్, పోలీస్​ చెక్​ పాయింట్లు, భద్రతా ఏర్పాట్లు, ప్రచారం, ఈవీఎంలు, ఓటింగ్​ ప్రక్రియ, కౌంటింగ్  వంటి అంశాలపై చర్చలు జరిపారు. మూడేండ్లు పైబడిన అధికారుల  బదిలీ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశాల్లో సీఈఓ వికాస్ రాజ్, జాయింట్​ సీఈఓ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.