- గత మార్చిలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీగా పార్టీ అభ్యర్థి విజయం
- అక్టోబర్ 1న పాలమూరులో ప్రధాని మోడీ బహిరంగ సభ
- ముమ్మర ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు
మహబూబ్‌నగర్, వెలుగు : అసెంబ్లీ ఎలక్షన్లకు టైం దగ్గర పడుతుండటంతో బీజేపీ హైకమాండ్ ఉమ్మడి పాలమూరు జిల్లాపై ఫుల్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ జిల్లాపై పట్టు సాధించడం ద్వారా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మెజార్టీ సీట్లను సాధించాలనే ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్ 1న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
దక్షిణ తెలంగాణ జిల్లాలపై పట్టు కోసం..
ఈ ఏడాది మార్చిలో జరిగిన మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పోటీ చేసిన ఎ.వెంకట నారాయణ రెడ్డి (ఏవీఎన్‌రెడ్డి) విజయం సాధించారు. రాష్ట్ర స్థాయి లీడర్లు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పర్యటించి, టీచర్లకు వారి సమస్యల పరిష్కారంపై భరోసా ఇవ్వడంతో రూలింగ్ పార్టీ బలపర్చిన అభ్యర్థికి కాకుండా బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు దగ్గర పడడంతో ఇదే ఫార్ములాను దక్షిణ తెలంగాణ అంతటా ఇంప్లిమెంట్ చేయాలని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో దాదాపు మెజార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.
మిగతా చోట్ల క్యాడర్లో జోష్ నింపేందుకు హైకమాండ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే చాన్స్ ఉండడంతో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రధాని సభలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందులోభాగంగా పాలమూరులో పీఎం సభ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పాలమూరులో ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
‘పాలమూరు’ స్కీంపైనే చర్చించే అవకాశం..
పీఎం ‘పాలమూరు’ స్కీంపైనే ప్రధానంగా మాట్లాడతారనే ప్రచారం జరుగుతోంది. అసంపూర్తి ప్రాజెక్టును కేవలం ఎలక్షన్ల కోసమే బీఆర్ఎస్ ఓపెన్ చేసిందనే విషయాన్ని ప్రజలకు వివరిస్తారు. సెంట్రల్ స్కీంలను తమ స్కీములుగా చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నట్లు తెలిసింది. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ స్కీముల ద్వారా ప్రజలు లబ్ధి పొందుతున్నారనే విషయాలను కూడా ఈ సభ ద్వారా మోడీ వివరిస్తారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
క్యాండిడేట్ల పేర్లు ఫైనల్ చేసే అవకాశం..
ఈ నెల 4 నుంచి 10 వరకు బీజేపీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థిత్వాల కోసం అప్లికేషన్లు తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 6,003 మంది అప్లై చేసుకున్నారు. ఇప్పటికే వడపోత కార్యక్రమం మొదలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అప్లికేషన్లను డివైడ్ చేశారు. ఇందులో ప్రధాని సభ నాటికి కొందరి పేర్లను కన్ఫాం చేయనున్నట్లు తెలిసింది. ఆ రోజు రిలీజ్ చేసే ఫస్ట్ లిస్టులో దాదాపు 60కి పైగా పేర్లుంటాయని చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సగానికి పైగా స్థానాల్లో అభ్యర్థిత్వాలను కన్ఫాం చేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది.
సీఎం వచ్చిన వెళ్లి రెండు వారాలకే..
ఎలక్షన్ ఏడాది కావడంతో బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ పార్టీల లీడర్లు ఉమ్మడి జిల్లాలో తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఈ నెల 17న సీఎం కేసీఆర్ నార్లాపూర్ వద్ద ‘పాలమూరు’ స్కీం మొదటి పంపును ప్రారంభించారు. ఆయన పర్యటించిన రెండు వారాల వ్యవధిలోనే ప్రధాని మోడీ కూడా పాలమూరు పర్యటనకు వస్తుండడం హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి రేవంత్‌రెడ్డి, ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఇతర రాష్ట్ర స్థాయి లీడర్లు సభలు, సమావేశాల్లో పాల్గొన్నారు.
బీజేపీ కూడా క్యాడర్లో జోష్ నింపేందుకు జాతీయ లీడర్లను రంగంలోకి దింపుతోంది. కొద్ది రోజుల కింద కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. మేలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నాగర్‌కర్నూల్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. 30న నిర్వహించే సభకు ప్రధాని నరేంద్ర మోడీ అటెండ్ అవుతుండడంతో ఆ పార్టీ క్యాడర్లో ఫుల్ జోష్ నిండుకుంది.