తెలంగాణలో ఐదారు నెలలు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?

తెలంగాణలో ఐదారు నెలలు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?
  • తెలంగాణలో ఐదారు నెలలు అసెంబ్లీ ఎన్నికలు వాయిదా?
  • బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో కలవరం
  • ఎంపీనా, ఎమ్మెల్యేనా తేల్చుకోలేని స్థితి
  • జమిలికి సై అంటున్న బీజేపీ.. ఎంపీగా పోటీకి నేతల మొగ్గు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అన్ని పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. ‘జమిలి’పై చర్చ ఆసక్తి రేపుతున్నది. తెలంగాణలో డిసెంబర్‌‌‌‌ లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ జమిలి వస్తే రాష్ట్రంలో ఎన్నికలు ఐదారు నెలలు వాయిదా పడుతాయని ప్రచారం జరుగుతున్నది. వాస్తవానికి మన రాష్ట్ర అసెంబ్లీ గడువు 2024 జనవరి 16తో తీరిపోతుంది. ఆలోగా ఎన్నికలు పూర్తి చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.  అలా జరగన అసెంబ్లీ గడువు పూర్తి అయినప్పటి నుంచి.. ఎన్నికలు జరిగేదాకా గవర్నర్ పాలనను విధించాల్సి వస్తుంది. ఆ కాలంలో నిర్ణయాధికారాలన్నీ గవర్నర్ చేతిలోనే ఉంటాయి. జమిలి ఎన్నికలకు బీజేపీ నేతలు అనుకూలంగా ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్‌‌లలో మాత్రం కలవరం రేగింది. డిసెంబర్‌‌‌‌ లోపే ఎన్నికలుంటాయని ఇప్పటికే గ్రౌండ్‌‌లోకి దిగిన నేతలు.. మరో ఆరు నెలల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

బీఆర్ఎస్ నేతల్లో గందరగోళం

అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి వస్తే తమ పరిస్థితి ఏమవుతుందోనని బీఆర్ఎస్ నేతలు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల్లోనూ టెన్షన్ తీవ్రమైంది. ఎన్నికలు లేటైతే ప్రభుత్వంపై వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. చివరి నిమిషంలో కొందరు అభ్యర్థులను లిస్ట్​ నుంచి తీసేసి పార్లమెంట్​కు పంపిస్తే అప్పుడు తమ పరిస్థితేంటని తలపట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థులందరూ ఇప్పటికే వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టేశారు. దీనిని మరో 8 నెలలు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి కొందరు సిట్టింగ్ ఎంపీలకూ ప్రస్తుతం అసెంబ్లీ అభ్యర్థులుగా జాబితాలో చోటిచ్చారు. 

మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక అభ్యర్థిగా ప్రకటించారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న కేసీఆర్.. తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేస్తారన్న టాక్ వినిపించింది. ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే.. కేసీఆర్ రెండు అసెంబ్లీ స్థానాలు, మెదక్ ఎంపీగా పోటీ చేస్తారా? లేదా ఏదైనా అసెంబ్లీ స్థానాన్ని వదులుకుంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. సనత్ నగర్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే బరిలో నిలిచారు. తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ను సికింద్రాబాద్ సీటు నుంచి పోటీ చేయించాలని పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నదని ప్రచారం జరుగుతున్నది. 

ధర్మపురి నుంచి ఎమ్మెల్యే బరిలో ఉన్న కొప్పుల ఈశ్వర్‌‌‌‌ను.. పెద్దపల్లి ఎంపీగా పోటీ చేయించాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది. మహబూబ్​నగర్ లోక్​సభ స్థానం నుంచి మంత్రి శ్రీనివాస్​గౌడ్ లేదా నిరంజన్ రెడ్డిలను బరిలో నిలపాలని భావిస్తున్నట్టు సమాచారం. మంత్రి జగదీశ్ రెడ్డిని భువనగిరి, మల్లారెడ్డిని మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేయించాలని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఆయా స్థానాల్లో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ లీడర్లు తమ వారి కోసం టికెట్ లాబీయింగ్ చేస్తున్నారు. నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, నిజామాబాద్ నుంచి కవిత, కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్​కుమార్‌‌‌‌లను పోటీకి నిలిపే అవకాశాలు ఉన్నాయి.

లోక్‌‌సభకు పోటీ చేసేందుకే బీజేపీ నేతల మొగ్గు

జమిలి ప్రచారం నేపథ్యంలో చాలా మంది బీజేపీ నేతలు లోక్‌‌సభకు పోటీ చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ముందుగా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉండడంతో.. కమలం నేతలంతా అనివార్యంగా అసెంబ్లీ వైపే చూశారు. ఇప్పుడు జమిలిపై చర్చ నేపథ్యంలో..  దేశంలో ప్రధాని మోదీ హవా కొనసాగుతుండడంతో ఎంపీగా అయితే గెలవడం ఈజీ అని చాలా మంది బీజేపీ నేతలు భావిస్తున్నారు. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీనియర్ నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 

ఈ జాబితాలో మల్కాజిగిరి, మహబూబ్ నగర్ ముందు వరుసలో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అర్వింద్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపూరావు.. తిరిగి ఎంపీగా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (పెద్దపల్లి), పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ (మహబూబ్ నగర్), సినీ నటి విజయశాంతి (మల్కాజిగిరి), పార్టీ మధ్య ప్రదేశ్ ఇన్​చార్జ్ మురళీధర్ రావు (మల్కాజిగిరి), తమిళనాడు బీజేపీ కో ఇన్​చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి

 (ఖమ్మం), మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (మహబూబ్ నగర్ ), మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (భువనగిరి లేదా నల్గొండ), మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (భువనగిరి), ఎమ్మెల్యే రాజాసింగ్‌‌పై సస్పెన్షన్‌‌ను బీజేపీ ఎత్తివేస్తే (జహీరాబాద్), ఎమ్మెల్యే రఘునందన్ రావు (మెదక్), పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి (నాగర్ కర్నూల్), మాజీ మంత్రి రవీంద్ర నాయక్, బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, ఇటీవల బీజేపీలో చేరిన బీఆర్ఎస్  నాయకుడు తేజావత్ రామచంద్రు (మహబూబాబాద్), ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా (వరంగల్) వంటి వారు ఎంపీగా పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఖర్చులు తడిసిమోపెడు!

జమిలి ఎన్నికల అంశం చాలా మంది నేతల్లో బుగులు రేపుతున్నది. ఖర్చు విషయంలో లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలంటేనే కనీసం 50 కోట్ల నుంచి వంద కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఐదు వందల కోట్లను దాటి ఖర్చు పెట్టాల్సి వస్తున్నది. హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్థులు పోటాపోటీగా ఖర్చు పెట్టిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే ఆర్థికంగా అంతగా లేని కొందరు నేతలు.. ఎన్నికలు లేట్ అయితే ఖర్చు ఎట్లా పెట్టుకోవాలని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన నేతలకు ఖర్చులు మోపెడవుతున్నాయి. కొందరు భూములు, ఆస్తులనూ అమ్ముకుంటున్నారు. మరో ఆరు నెలలు ఎన్నికలు వాయిదా పడితే.. ప్రచారానికి మరింత సొమ్మును ఎక్కడి నుంచి తీసుకొచ్చేదని వాపోతున్నారు.

కాంగ్రెస్‌‌లో కంగారు

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించే విషయంపై ఇప్పుడిప్పుడే కసరత్తులను మొదలు పెట్టింది. ఈ నెల రెండోవారంలో తొలి లిస్టును ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఎంపీ బరిలో నిలిచిన చాలా మంది నేతలు అసెంబ్లీ కోసమూ పోటీ పడుతున్నారు. సిట్టింగ్ ఎంపీలైన రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. నిజామాబాద్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ నేపథ్యంలోనే ఒకేసారి ఎన్నికలు పెడితే దేనికి పోటీ చేయాలన్న దానిపై సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉందని చర్చ నడుస్తున్నది. తొలిసారి హైదరాబాద్‌‌లో నిర్వహించనున్న సీడబ్ల్యూసీ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై చర్చిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు జమిలి ఎన్నికలను కేంద్రం ఎందుకు తెరపైకి తీసుకొచ్చింది? దాని వల్ల పార్టీపై పడే ప్రభావం? ఎన్నికల్లో లాభనష్టాల గురించి చర్చించి ఏం చేయాలన్నదానిపై నిర్ణయానికొస్తామని అంటున్నారు.