భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
  • రెండు, మూడు నెలల్లోపేఅమలుకు విధివిధానాలు
  • అన్ని పక్షాల సూచనలు, సలహాలు రూల్స్​లో ఉండేలా జాగ్రత్తలు
  • నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ భూ భారతి (భూహక్కుల చట్టం)–2024  బిల్లుకు శుక్రవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లుపై శనివారం శాసనమండలిలో చర్చించి ఆమోదించనున్నారు. అనంతరం ప్రభుత్వం ఉభయ సభల ఆమోదం పొందిన భూ భారతిని రాష్ట్ర గవర్నర్ అప్రూవల్ కోసం పంపనున్నారు. గవర్నర్ ఆమోద ముద్ర తరువాత చట్టం రూపకంగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ముద్రిస్తుంది. భూ భారతి –2024 చట్టానికి అనుగుణంగా రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. వాస్తవానికి ఆర్ఓఆర్–2020 చట్టానికి సంబంధించి ఎలాంటి రూల్స్​ను ఇవ్వలేదు. 

దీంతో ఈసారి పకడ్బందీగా చట్టం ఇంప్లిమెంటేషన్ కోసం విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. అసెంబ్లీలో సభ్యుల నుంచి వచ్చిన సూచనలు, సలహాలన్నింటిని కూడా రూల్స్​లో వచ్చేలా చూసుకుంటామని మంత్రి పొంగులేటి   ప్రకటించారు.  2, 3 నెలల్లోపే భూ భారతి ఆర్ఓఆర్–2024 చట్టంకు సంబంధించిన రూల్స్​ను తీసుకురానున్నట్లు సీసీఏల్ఏ, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. చట్టానికి అనుగుణంగా ధరణి పోర్టల్ పేరు భూ భారతిగా మారుస్తారు.  33 గా ఉన్న మాడ్యుల్స్​ను 6 కు కుదిస్తారు.  అనేక అంశాలను కొత్తగా చేరుస్తారు. 

భూ భారతి ప్రకారం కొన్నేండ్లుగా గ్రామాల్లో నిలిచిపోయిన జమాబందీ మళ్లీ నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకు గ్రామాల్లో రెవెన్యూ అధికారిని నియమించాల్సి ఉంటుంది. దీనికి దాదాపు నెల పైనే పట్టే అవకాశం ఉంది.  అసెంబ్లీలో తొలిసారిగా మంత్రి హోదాలో తాను ఇటువంటి గొప్ప బిల్లును ప్రవేశ‌‌‌‌‌‌‌‌పెడుతుంటే కళ్లు ఆనందభాష్పాలతో చెమ్మగిల్లుతున్నాయని పొంగులేటి పేర్కొన్నారు. భూ భారతి ఆర్​ఓఆర్–2024 బిల్లు చర్చలో అధికార పార్టీతో పాటు బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు పాల్గొని పలు సూచనలు చేశారు.  బిల్లు ప్రవేశపెట్టిన  పొంగులేటిని అధికార, ప్రతిపక్ష సభ్యులు అభినందించారు.