హైదరాబాద్: ఈ-ఫార్ములా కార్ రేస్ కేసుపై తెలంగాణ అసెంబ్లీ అట్టుడికింది. ఈ వ్యవహారంపై అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య వాగ్వాదం నడిచింది. పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ సభ్యుల ఆందోళనతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. కాంగ్రెస్ సభ్యులపై పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పేపర్లు విసిరారు. బీఆర్ఎస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లారు. సభలో స్పీకర్ పైకి కూడా కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పేపర్లు విసరడంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.
స్పీకర్ పై బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముందుగా పేపర్లు విసిరారు. స్పీకర్ పోడియం వద్దకు చొచ్చుకుని వెళ్లేందుకు మాజీ మంత్రి హరీష్ రావు యత్నించారు. ఫార్ములా ఈ కార్ రేసుపై చర్చించాలని బీఆర్ఎస్ పట్టుబట్టింది. ఏసీబీ కేసు నమోదు తర్వాత సభలో చర్చించే అవకాశం లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రూల్స్ తెలిసి కూడా బీఆర్ఎస్ కావాలని గొడవ చేస్తుందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. అయితే అసెంబ్లీలో బీఆర్ఎస్ రెచ్చగొట్టిందని కాంగ్రెస్ ఆరోపించింది.
కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని హరీశ్ రావు ఆరోపించారు. ఫార్ములా ఈ కార్ రేసుపై అక్రమ కేసులు పెట్టారని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చించాలని హరీశ్ రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరుపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సీనియర్ సభ్యులు కూడా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, కీలకమైన భూభారతి బిల్లుపై చర్చ జరగాలని స్పీకర్ చెప్పారు.
ఒక వ్యక్తి కోసం సభను అడ్డుకోవడం కరెక్ట్ కాదని, సభను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హితవు పలికారు. సభలో జరిగిన ఘటన బాధాకరం అని, దళిత స్పీకర్ పై దాడికి యత్నించడం బాధాకరమని బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు.