
హైదరాబాద్: అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఏం పనులు కావాలన్నా 30 శాతం కమీషన్లు కాంగ్రెస్ నేతలు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. కమీషన్లు తీసుకోనిదే పనులు చేయడం లేదని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల మంటలు రాజేశాయి. కేటీఆర్ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు నిరూపించాలని, నిరూపించలేకపోతే సభకు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని స్పీకర్ స్పష్టం చేశారు.
Also Read:-ధరణి వద్దని ఓటుతో ప్రజలు తీర్పు చెప్పారు..
మీలాగా బరితెగించి రాజకీయాలు చేయడం లేదని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మీరేనని కేటీఆర్ వ్యాఖ్యలపై భట్టి మండిపడ్డారు. అడ్డగోలుగా దోచుకున్నది మీరని, ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సభ్యులకు హితవు పలికారు. భట్టి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. సభ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. స్పీకర్ మైక్ ఇవ్వనందుకు నిరసనగా వాకౌట్ చేసినట్లు బీఆర్ఎస్ సభ్యులు తెలిపారు.