హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశం వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. అసెంబ్లీ నోట్స్, మినిట్స్ తయారీకి కొంత సమయం పడుతుందని.. అప్పటి వరకు సభను వాయిదా వేయాలని అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ను కోరారు.
మంత్రి విజ్ఞప్తి మేరకు సభ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. సభ వాయిదా విధానంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన నిమిషానికి వాయిదా వేయడం ఏంటని బీఆర్ఎస్ ఎమ్మేల్యే గంగుల కమలాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్కు సభను నడపడం రావట్లేదని ఆయన విమర్శించారు.
కుల గణన నివేదికపై చర్చించి.. ఆమోదం తెలిపేందుకు మంగళవారం (ఫిబ్రవరి 4) అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కుల గణన సర్వే పూర్తి అయిన విషయం తెలిసిందే. కుల గణన సర్వే రిపోర్టును ప్లానింగ్ కమిషన్ కేబినెట్ సభ్ కమిటీకి అందజేసింది.
ఈ నేపథ్యంలో మంగళవారం (ఫిబ్రవరి 4) తెలంగాణ కేబినెట్ భేటీ అయ్యి కుల గణన సర్వే రిపోర్టుకు ఆమోదం తెలపనుంది. కేబినెట్ గ్రీన్ సిగ్నల్ అనంతరం కుల గణన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ అనంతరం ఆమోదం తెలపనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మంగళవారం (ఫిబ్రవరి 4) ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది.