తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆరగంట సేపు వాయిదా పడ్డాయి. రాష్ట్ర అర్ధిక పరిస్థితిపై అర్థిక మంత్రి భట్టి విక్రమార్క షార్ట్ నోట్ రిలీజ్ చేశారు. అయితే దీనిని చదివే సమయం కూడా తమకు ఇవ్వలేదని, చర్చకు ముందురోజు డాక్యుమెంట్ ఇస్తే బాగుండేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. నోట్ చదవకుండానే మాట్లాడమనడం సరికాదన్నారు.
హరీష్ రావుతో పాటుగా ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఐ ఫ్లోర్ లీడర్ కూనంనేని సాంబశివరావు కూడా 40 పేజీల పుస్తకం చదవాలంటే టైమ్ కావాలని స్పీకర్ ను కోరారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. గతంలో కూడా ప్రతి లఘు చర్చ సందర్భంలోనే నోట్ ఇచ్చేవారిని చెప్పారు. దానిని మారుద్దాం అంటే ఓకే అని సమాధానం ఇచ్చారు. సభ్యులు తామిచ్చిన నోట్‌పై ప్రిపేర్ అయ్యేందుకు టీ బ్రేక్‌కు అనుమతిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. దీంతో స్పీకర్ అరంగంట సేపు సభను వాయిదా వేశారు.
అంతకుముందు అసెంబ్లీలో చర్చను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. శ్వేత పత్రాన్ని విడుదల చేశారు. 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు. ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కలలన్నీ గత ప్రభుత్వం హయాంలో కల్లలుగా మిగిలిపోయాయి.. రోజువారీ ఖర్చులకు కూడా ఓడీ తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దశాబ్ద కాలంగా జరిగిన ఆర్థిక అరాచకం ప్రజలకు తెలియాలి.. ప్రజలు మాపై నమ్మకం ఉంచి సహేతుకమైన తీర్పునిచ్చారు.. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని ఆయన అన్నారు.
- రాష్ట్ర మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు.
- 2014-15 నాటికి రాష్ట్ర రుణం రూ. 72,658 కోట్లు.
- 2014-15 నుంచి 2022-23 మధ్య కాలంలో సగటున 24.5 శాతం పెరిగిన అప్పు.
- 2023-24 అంచనాల ప్రకారం రాష్ట్ర రుణం రూ. 3,89,673 కోట్లు.
- 2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం.
- 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతం.
- బడ్జెట్‌కు, వాస్తవ వ్యయానికి మధ్య 20శాతం అంతరం.
- 57 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి రూ. 4.98 లక్షల కోట్ల వ్యయం.
- రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 రెట్లు పెరిగిన రుణభారం.