హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా నడుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి శ్రీధర్ బాబు తప్పుబట్టారు. సీఎం రేవంత్ పేమెంట్ కోటాలో వచ్చారని తామూ అనొచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీరియస్ ఇష్యూను కావాలనే పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. సభలో నియమ, నిబంధనలపై కేటీఆర్, మంత్రి శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం నడిచింది. పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యయుతంగా ప్రవర్తించలేదని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. ఇక.. కేంద్ర బడ్జెట్ పై స్పందిస్తూ తెలంగాణపై కేంద్రానిది ముమ్మాటికీ వివక్షే అని ఆయన ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా తెలంగాణ ఊసే లేదని శ్రీధర్ బాబు గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందన్నారు. విభజన చట్టంలో 35 హామీలున్నాయని మంత్రి శ్రీధర్ బాబు గుర్తుచేశారు.
Also Read:-భయంతోనే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా
ఏపీకి నిధులిస్తే తమకు అభ్యంతరం లేదని, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులివ్వాలని మంత్రి శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. మిత్ర పక్షాలుగా ఉన్న ఏపీ, బీహార్ కే నిధులిచ్చారని ఆయన చెప్పారు. విభజన చట్టం పేరుతో ఏపీకి మాత్రమే నిధులిస్తారా అని కేంద్రాన్ని శ్రీధర్ బాబు నిలదీశారు. తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులివ్వాలని కోరినా పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్-బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ లోనూ తెలంగాణకు అన్యాయమే జరిగిందని, ఇండస్ట్రియల్ కారిడార్ కేంద్రం ఏపీలో ఉంటుందని శ్రీధర్ బాబు చెప్పారు.