Telangana Assemlby: గవర్నర్ ప్రసంగంలో 30 మోసాలు..60 అబద్ధాలు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

వర్నర్ ప్రసంగంలో మొత్తం 30 మోసాలు 60  అబద్దాలున్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే  పల్లా రాజేశ్వర్ రెడ్డి. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్బంగా మాట్లాడారు.  గవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావనే లేదన్నారు. మేనిఫేస్టో అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేవన్నారు. గవర్నర్ ప్రసంగం అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. కాంగ్రెస్ 420 హామీలను..420 అడుగుల లోతులో పాతిపెట్టిందన్నారు.

ప్రజావాణికి సీఎం రేవంత్ ఎందుకు హాజరుకావడం లేదని ప్రశ్నించారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ వారానికి ఓసారి కూడా ప్రజాభవన్ పోలేదు..60 రోజుల్లో  6 నిముషాలు ప్రజాభవన్ లో లేరు. మంత్రులు పోవడం లేదు చివరకు  ఔట్ సోర్సింగ్  ఉద్యోగులతో  అప్లికేషన్లు తీసుకుంటున్నారని చెప్పారు.  ప్రజావాణిని ప్రారంభంలోనే మంత్రులు పక్కన పెట్టారని తెలిపారు. ప్రజావాణిలో ఎన్ని సమస్యలు పరిష్కరించారో  చెప్పాలన్నారు.  ఆరు గ్యారంటీల గురించి కాంగ్రెస్ గొప్పగా చెప్పుకుంటుంది.. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.20 కోట్లు ఖర్చు చేస్తే 60 కోట్ల ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు.  

Also Read:Telangana Assembly : మహిళలకు ఫ్రీ బస్సు ఉండాలా.. వద్దా : సీతక్క సూటి ప్రశ్న
 

బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రగతి భవన్ లోనే శ్రీకారం చుట్టామని చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  .రైతుబంధు, దళితబంధు అక్కడే పురుడు పోసుకున్నాయని చెప్పారు.

ఒక గ్యారంటీలో ఒక పథకాన్ని మాత్రమే ప్రారంభించారని చెప్పారు పల్లా రాజేశ్వర్ రెడ్డి.  ఆరున్న లక్షల మంది ఆటోడ్రైవర్లు రోడ్డున పడ్డారని చెప్పారు.  రెండు నెలల్లో 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో ఆటో డ్రైవర్  కుటుంబాలకు రూ.20 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.