మన్మోహన్​కు భారతరత్న ఇవ్వాలి.. ఏకగ్రీవంగా తీర్మానించిన అసెంబ్లీ

  •  తెలంగాణ ఆత్మబంధువు మన్మోహన్: సీఎం రేవంత్​
  • హైదరాబాద్​లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన
  • రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • నిరాడంబర జీవితానికి చిరునామా: మంత్రి ఉత్తమ్​
  • ఎకో సిస్టమ్​కు నాంది పలికారు: మంత్రి శ్రీధర్​బాబు
  • సింపుల్ లివింగ్..- హై థింకింగ్​కు పర్యాయపదం: కేటీఆర్​
  • దేశానికి గమనం నేర్పిన లీడర్​: కూనంనేని
  • స్కిల్​ వర్సిటీకి మన్మోహన్​ పేరు పెట్టాలి: వివేక్​ వెంకటస్వామి


 

హైదరాబాద్, వెలుగు: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. మన్మోహన్​సింగ్​ మృతికి సంతాపం తెలిపేందుకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది.  ఆయన సేవలను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని సభ్యులు గుర్తుచేసుకున్నారు. మొదట సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టి మాట్లాడారు. ‘‘తెలంగాణకు మన్మోహన్​సింగ్​ ఆత్మబంధువు. తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసిన వ్యక్తిగా ఆయనను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు” అని  పేర్కొన్నారు. దేశాన్ని ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడంపైనే మన్మోహన్  దృష్టిసారించారని తెలిపారు. హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం అన్నారు. కాగా, మన్మోహన్​కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. రాష్ట్రంలో స్కిల్‌‌‌‌‌‌‌‌ డెవలప్​మెంట్​ సెంటర్​, ఏదైనా ఒక ప్రముఖ ఇన్​స్టిట్యూషన్​కు మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితోపాటు పలువురు సభ్యులు కోరారు. 

గొప్ప మానవతావాది

మన తెలంగాణ బిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. ఆర్థిక, రాజకీయ అంశాల్లో అందరికీ మన్మోహన్​సింగ్ ఆదర్శమని తెలిపారు. ‘‘నీతి, నిజాయతీ, నిబద్ధతకు రోల్​మోడల్​ మన్మోహన్​ సింగ్​. ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడేవాళ్లు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థిక వేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్. ఆయన మరణం తీరని లోటు” అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొన్నేండ్ల కింద పార్లమెంటు సభ్యులుగా తమతో పాటు మన్మోహన్​ సింగ్​ ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని..  నాడు మొదటిసారి ఎంపీలమైన తమతో ఆయన కలిసి కూర్చోవడం ఎప్పటికీ మరిచిపోలేమని సీఎం అన్నారు. ‘‘నాడు నిరసనలో మన్మోహన్​తో కలిసి నేను, ఉత్తమ్, వెంకట్​రెడ్డి పాల్గొన్నాం. ఆయనతో కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడటం జీవిత కాలం గుర్తుండిపోయే అంశం” అని  ఆయన తెలిపారు. ఉపాధి హామీ పథకం తెచ్చి పేదలకు 100 రోజుల పని కల్పించిన వ్యక్తి  మన్మోహన్ సింగ్  అని..  ఫుడ్ సెక్యూరిటీ, సమాచార హక్కు చట్టాలను తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఉపాధి స్కీమ్​ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం, మహబూబ్​నగర్​లో లాంఛ్ చేశారు. 2013లో భూసేకరణ చట్టం, 2006 లో అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చి భూమిలేని పేదలకు మేలు జరిగేలా చేశారు. పదేండ్లు అద్భుతమైన పాలన అందించారు” అని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ నిరాశ్రయుల కోసం చట్టాలను మన్మోహన్​ సింగ్ తీసుకువచ్చారని.. అలాంటి గొప్ప మానవతావాదిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. ‘‘మన్మోహన్ ​సింగ్ తీసుకొచ్చిన సరళీకృత విధానాలు దేశం దశ-దిశను మార్చాయి. దేశానికి ఆయన మాజీ ప్రధాని, మాజీ ఆర్థిక మంత్రి.. కానీ, తెలంగాణకు ఆయన ఆత్మబంధువు. తెలంగాణ రాష్ట్రానికి పురుడుపోసిన వ్యక్తిగా ఆయన్ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. తెలంగాణ బిల్లును లోక్​సభ, రాజ్యసభలో ఆమోదించిన వ్యక్తి మన్మోహన్” అని  సీఎం పేర్కొన్నారు. 

తెలంగాణ అంటే ప్రత్యేక అభిమానం

మన్మోహన్ మృతి వార్త తెలియగానే వెంటనే బెళగావీ నుంచి ఢిల్లీ వెళ్లి నివాళులు అర్పించానని సీఎం రేవంత్​ రెడ్డి తెలిపారు. “మన్మోహన్ సతీమణి దగ్గరకు వెళ్లి తెలంగాణ సీఎం అని పరిచయం చేసుకున్నాను. తెలంగాణ అంటే మన్మోహన్​కు ప్రత్యేక అభిమానం అని, రాష్ట్రానికి ఆయన ఆశీస్సులు ఉంటాయని ఆమె చెప్పారు” అని పేర్కొన్నారు. పిల్లలను నిరాడంబరంగా, గొప్ప విలువలతో మన్మోహన్ ​సింగ్​ పెంచారని తెలిపారు. ‘‘మన్మోహన్​ చేసిన సేవలకు గుర్తుగా తెలంగాణ శాసనసభ ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి” అని సీఎం కోరారు. తెలంగాణ బిల్లు టైమ్​లో మన్మోహన్ సింగ్, జైపాల్​రెడ్డి కలిసి సమన్వయం చేసుకొని ముందుకు సాగారని తెలిపారు. ‘‘హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్​లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. శాశ్వతంగా ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను చేసుకుందాం. ఆయన విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను కోరుతున్నాం. మంచి ప్రాంతంలో, ప్రజలు అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఏర్పాటు చేసుకుందాం. తెలంగాణ గడ్డపై మన్మోహన్ సింగ్ విగ్రహం పెట్టడం సముచితం అని భావిస్తున్నాం” అని సీఎం రేవంత్  పేర్కొన్నారు. 

దేశానికి నడక నేర్పిన లీడర్​: కూనంనేని

నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దం మన్మోహన్ సింగ్  అని.. తెలంగాణ ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించారని సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశానికి  గమనాన్ని నేర్పిన నేత మన్మోహన్​ అని పేర్కొన్నారు. ‘‘రాజకీయ చరిత్రలో మచ్చలేని వ్యక్తి మన్మోహన్ సింగ్. ఉపాధిహామీ చట్టం, ఆర్టీఐ, భూ నిర్వాసితుల చట్టం, అటవీ హక్కుల చట్టం తెచ్చారు. అంకిత భావం, ఆర్థిక విశ్లేషణ ఆయన సొంతం. గొప్ప మానవతావాది” అని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ సంతాప సభను వివాదాస్పద రాజకీయాలకు ముడిపెట్టొద్దని సభ్యులకు ఆయన సూచించారు.  

తెలంగాణ ఏర్పాటులో కీ రోల్: జుల్ఫికర్ అలీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారని ఎంఐఎం ఎమ్మెల్యే జుల్ఫీకర్ అలీ అన్నారు. సంతాప తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడా రు. ‘‘బలహీనవర్గాల భద్రతకు మన్మోహన్​సింగ్​ పెద్దపీట వేశారు.  మైనార్టీ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు వచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. ఉపాధి హామీ, ఆర్టీఐ చట్టంతో పాటు ఎన్నో కీలక చట్టాలు తీసుకొచ్చారు” అని గుర్తుచేశారు.  

ఎకో సిస్టమ్​కు నాంది పలికారు: శ్రీధర్ బాబు

ఎకో సిస్టమ్​కు నాంది పలికిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్  అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.  ప్రగతిశీల విధానాలకు రూపకల్పన చేశారని, ఐటీ సెక్టార్ లో రిఫార్మ్స్ తీసుకొచ్చారని గుర్తుచేశారు. ‘‘మన్మోహన్ నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆయన ఆలోచనల మేరకు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం. దేశ ఆర్థికాభివృద్ధికి ఆయన తీసుకున్న నిర్ణయాలు, సంస్కరణలు దోహదపడ్డాయి. స్టాక్ మార్కెట్ పటిష్టంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. బ్యాంకుల జాతీయీకరణ, సాగునీటి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారు” అని తెలిపారు.

ఆయనది సింపుల్​ లివింగ్​.. హై థింకింగ్​: కేటీఆర్​

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్​కు భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. సంతాప తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడారు. “మన తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్​ను ప్రభుత్వంలోకి నేరుగా లేటరల్ ఎంట్రీ ద్వారా తీసుకువచ్చారు. ఆర్థిక మంత్రిగా నియమించారు. సింపుల్ లివింగ్-.. హై థింకింగ్ అనే జీవన విధానానికి మన్మోహన్ సింగ్ పర్యాయపదం. లాయాల్టీ, నిబద్ధత అనేది ప్రస్తుతం  రాజకీయాల్లో అత్యంత అరుదుగా కనిపిస్తున్నది. కానీ, తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం పాటు కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు మన్మోహన్ ​సింగ్. హైదరాబాద్​లో ఆయన విగ్ర హం ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం. మన్మోహన్​ను రాజకీయాల్లోకి తీసుకొచ్చి దేశానికి గొప్ప నాయకుడ్ని అందించిన పీవీ నర్సింహారావుకు ఢిల్లీలో ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలి” అని  కేటీఆర్ అన్నారు.

నిరాడంబర జీవితానికి చిరునామా: ఉత్తమ్​

పదేండ్లపాటు ప్రధానమంత్రిగా మన్మోహన్​సింగ్​ ఈ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. “యావత్ భారతదేశ రైతాంగానికి ఏక కాలంలో రుణమాఫీ చేసిన ఘనత మన్మోహన్​కే దక్కుతుంది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్​ చైర్మన్ హోదాలో నాడు ఏఐసీసీ చీఫ్​ సోనియాగాంధీ సూచనల మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం చట్టానికి మన్మోహన్ రూపకల్పన చేశారు.  ఆయన ఆధ్వర్యంలో రూపొదిద్దుకున్న భూసేకరణ చట్టం మానవీయ విలువలకు అద్దం పడుతుంది” అని తెలిపారు. నిరాడంబర జీవితానికి మన్మోహన్​సింగ్​ చిరునామా అని పేర్కొన్నారు. మాజీ ప్రధానినన్న దర్పాన్ని ఏనాడూ మన్మోహన్​సింగ్ చూపించలేదని.. ఇందుకు పార్ల మెంట్ ప్రాంగణంలో ఆయన తమతో కలిసి నిర సనలో పాల్గొనడమే నిదర్శనమని గుర్తుచేసుకున్నారు. మన్మోహన్​ భారతరత్న ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేయాలన్న సీఎం ప్రతిపాదనను అంగీకరిస్తున్నానని ఉత్తమ్ ప్రకటించారు. 

రుణమాఫీకి స్ఫూర్తి ప్రదాత: భట్టి 

తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్​లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి నాడు యూపీఏ చైర్​పర్సన్ సోనియా గాంధీ, నాటి ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తు చేశారు. సంతాప తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడారు. ‘‘దేశంలో మొట్టమొదటిసారి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని, ప్రస్తుతం రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ పథకానికి స్ఫూర్తి ప్రదాత మన్మోహన్. హైదరాబాద్​లో మన్మోహన్ సింగ్ విగ్రహ ఏర్పాటు చేయాలని, ఆయనకు భారతరత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నాను” అని తెలిపారు.  ప్రతి పదవికి మన్మోహన్​సింగ్​ వన్నె తెచ్చారని.. దేశ ఆర్థిక పరిస్థితు లే కాదు సామాజిక పరిస్థితులు అర్థం చేసుకొని అనేక చట్టాలు తెచ్చారని పేర్కొన్నారు. ‘‘సామా న్యుడు సమాచారాన్ని తెలుసుకునే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారు. దేశగతినే మార్చిన ఉపాధి హామీ పథకం చట్టాన్ని ఆయన తీసుకువచ్చారు” అని భట్టి గుర్తుచేశారు.

 

  • నీతి, నిజాయితీ, నిబద్ధతకు మారుపేరు మన్మోహన్​సింగ్​. ప్రస్తుత సమాజంలో ఆయనతో పోటీ పడేవాళ్లు లేరు. ప్రపంచం గర్వించదగ్గ గొప్ప ఆర్థిక వేత్త, తత్వవేత్త, రాజకీయ నేత మన్మోహన్. ఆయన మరణం తీరని లోటు.
  • ఉపాధి స్కీమ్​ను నాడు ఉమ్మడి ఏపీలో అనంతపురం, మహబూబ్ నగర్​లో లాంఛ్ చేశారు.  2013లో భూసేకరణ చట్టం, 2006 లో అటవీ హక్కుల చట్టాన్ని తెచ్చి భూమిలేని పేదలకు మేలు చేశారు. పదేండ్లు అద్భుతమైన పాలనను అందించారు.
  • మన్మోహన్​ చేసిన సేవలకు గుర్తుగా అసెంబ్లీ ఒక రోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనకు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి.- సీఎం రేవంత్​ రెడ్డి