ఎస్సీ వర్గీకరణకు ఆమోదం.. శాసనసభ, మండలిలో బిల్లు పాస్

ఎస్సీ వర్గీకరణకు ఆమోదం.. శాసనసభ, మండలిలో బిల్లు పాస్
  • దేశంలోనేతొలి రాష్ట్రంగాతెలంగాణ రికార్డు
  • ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నం: సీఎం రేవంత్
  • ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం
  • దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతోమంది అమరులయ్యారు
  • వాళ్ల కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తం
  • ఎమ్మెల్యే వివేక్ సూచన మేరకు ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతం
  • 2026 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం 
  • తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసన సభ, మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏండ్లుగా పోరాటం జరుగుతుండగా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే.. రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా, మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలూ మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. 

ఇక గవర్నర్ ఆమోదం అనంతరం.. ఇది చట్టంగా మారనుంది. ఆ వెంటనే ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తెస్తూ ప్రభుత్వం జీవోలు జారీ చేయనుంది. ఎస్సీలను మూడు గ్రూపులుగా విభజించి, ప్రస్తుతమున్న 15 శాతం రిజర్వేషన్లను ఆ మూడు గ్రూపులకు పంచి.. ఎస్సీ వర్గీకరణ బిల్లు తీసుకొచ్చారు. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్-1లో చేర్చారు. ఎస్సీల్లో వీరి జనాభా 3.288 శాతం కాగా, వీళ్లకు ఒక్క శాతం రిజర్వేషన్ కల్పించారు. 

ఎస్సీల్లో కొంతమేర లబ్ధి పొందిన 18 కులాలను గ్రూప్ -2లో చేర్చారు. ఎస్సీల్లో వీరి జనాభా 62.748 శాతం కాగా, వీళ్లకు 9 శాతం రిజర్వేషన్ ఇచ్చారు. ఇక ఎస్సీల్లో ఎక్కువగా ప్రయోజనం పొందిన 26 కులాలను గ్రూప్ -3లో చేర్చారు. ఎస్సీల్లో వీరి జనాభా 33.963 శాతం కాగా, వీళ్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారు. కాగా, అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందడంతో ఎస్సీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. 

రిజర్వేషన్లు పెంచుతాం.. 

ఎస్సీ వర్గీకరణతో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టకున్నామని చెప్పారు. ‘‘ఉత్తమ్ పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌గా ఉన్నప్పుడు 2018 ఎన్నికల టైమ్‌‌‌‌‌‌‌‌లో రాహుల్ రాష్ట్రానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. 2023 ఆగస్టు 26న చేవెళ్ల సభలో కాంగ్రెస్​చీఫ్‌‌‌‌‌‌‌‌ మల్లికార్జున ఖర్గే ఎస్సీ డిక్లరేషన్ ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేశాం. 

బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన సభ్యులకు నా కృతజ్ఞతలు. నేను ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ సమస్య పరిష్కారం కావడం సంతోషం” అని అన్నారు. ‘‘ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం జరుగుతున్నది. ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. చనిపోయినోళ్ల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది. వారి కుటుంబాలకు ఇందిమ్మ ఇండ్లు, రాజీవ్​యువ వికాసం పథకాల్లో మెదటి ప్రాధాన్యం కల్పిస్తాం” అని ప్రకటించారు. 

‘‘ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచాలని ఎమ్మెల్యే వివేక్​వెంకటస్వామి సూచించారు. 2026లో జనగణన పూర్తి కాగానే, ఆ లెక్కల ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లు పెంచుతాం. అది మా బాధ్యత. సభా నాయకుడిగా నేను మాట ఇస్తున్నా.. ఇందిరమ్మ రాజ్యంలో మీకు అన్యాయం జరగదు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటం” అని హామీ ఇచ్చారు. 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచే కసరత్తు.. 

అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఎస్సీ వర్గీకరణ కోసం కసరత్తు ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘మేం అధికారంలోకి  రాగానే మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో రాష్ట్ర బృందాన్ని ఢిల్లీకి పంపించాం. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో మా వాదనలు వినిపించాం. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాం. అసెంబ్లీలోనూ తీర్మానం చేశాం. ఉత్తమ్​కుమార్​రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించాం. 

మంత్రివర్గ ఉపసంఘం సూచన మేరకు షమీమ్ అక్తర్ కమిషన్ ఏర్పాటు చేశాం. కమిషన్ ఇచ్చిన సూచనలను తూ.చ తప్పకుండా అమలు చేస్తున్నాం. ప్రజల నుంచి 8,681 ప్రతిపాదనలు స్వీకరించి, వాటిని క్రోడీకరించి కమిషన్ నివేదిక రూపొందించింది. 59 ఎస్సీ ఉప కులాలను 3 గ్రూపులుగా విభజించి, 15 శాతం రిజర్వేషన్లను పంచిపెట్టింది. 59 కులాలు ఇప్పటి వరకు పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫార్సులు చేసింది” అని వివరించారు. ఏ,బీ,సీ,డీ, కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ చేసే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. కమిషన్ సిపార్సులతో పాటు ఎంపిరికల్ డేటాను ద‌‌‌‌‌‌‌‌ృష్టిలో పెట్టుకుని న్యాయపరమైన చిక్కులు రాకుండా బిల్లును తయారు చేశామని చెప్పారు.  

దళితులకు అండగా కాంగ్రెస్.. 

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘పార్టీలో, ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ చేసింది. ఆ తర్వాత​నెహ్రూ తన మొదటి కేబినెట్‌‌‌‌‌‌‌‌లో న్యాయ శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. అదే విధంగా దళిత నేత బాబూ జగ్జీవన్ రామ్‌‌‌‌‌‌‌‌కు కేంద్రంలో కీలకమైన రక్షణ, వ్యవసాయ, రైల్వే శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించి గౌరవించింది. దేశంలోనే తొలిసారి ఎస్సీ వర్గానికి చెందిన దామోదరం సంజీవయ్యను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా చేసింది. 

ఆయనను 1960లో ఉమ్మడి రాష్ట్రంలో సీఎం చేసి, దళితుడిని ముఖ్యమంత్రి చేసిన పార్టీగా చరిత్ర సృష్టించింది. అలాగే బిహార్​సీఎంగా భోలా పాశ్వాన్‌‌‌‌‌‌‌‌ను, మహారాష్ట్ర సీఎంగా, గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సుశీల్ కుమార్​షిండేను నియమించింది. ఇటీవల పంజాబ్​సీఎంగా చరణ్​జిత్ సింగ్​ చన్నీని నియమించింది. లోక్‌‌‌‌‌‌‌‌సభ స్పీకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కాంగ్రెస్​నియమించిన దళిత బిడ్డ మీరాకుమార్ నేతృత్వంలోనే తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది. దళితుడైన మల్లికార్జున ఖర్గే  కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు” అని చెప్పారు.  

సంక్లిష్టమైన సమస్యకు శాశ్వత పరిష్కారం..  

సంక్లిష్టమైన ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఉమ్మడి ఏపీ నుంచే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం జరుగుతు న్నది. ఈ ఉద్యమంలో ఎంతోమంది తమ ప్రాణాలు అర్పించారు. వర్గీకరణ వ్యక్తిగతంగా నా మనససు చాలా దగ్గరగా ఉన్న అంశం. నా ప్రజా జీవితంలో ఈ వర్గాలు అండగా నిలబడి, నా ఎదుగుదలలో పూర్తిగా సహక రించాయి. ఈరోజు ఈ సమస్యను పరిష్కరిం చడానికి నాకు ఒక అవకాశం వచ్చింది. 

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నదే మా విధానం. 2004లో వైఎస్ హయాంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఇదే సభలో ఆనాడు తీర్మానం పెట్టి ఏకగ్రీవంగా ఆమోదిం చారు. ఆ తీర్మానం నేపథ్యంలో 2007లో ఉషా మెహ్రా కమిషన్ వేశారు. రాజ్యాంగం లోని ఆర్టికల్​324లో సవరణ చేయడం ద్వారా శాసనసభ తీర్మానాన్ని పార్లమెంట్​ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్​నివేదిక ఇచ్చింది. కానీ వివిధ కారణాలతో అది అమలు జరుగకుండా వాయిదా పడుతూ వచ్చింది” అని వివరించారు. 

మండలిలోనూ ఆమోదం

ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిపింది. మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి దామోదర రాజనర్సింహ వర్గీకరణ బిల్లును మండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్గీకరణ అమలు చేసే తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఆరు నెలల్లో ప్రక్రియ పూర్తయి, చట్టం వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేశారని వెల్లడించారు. ఇది సీఎం కమిట్‌‌‌‌మెంట్‌‌‌‌, నిబద్దత, దార్శనికత్వానికి నిదర్శనమన్నారు. 

సామాజిక న్యాయాన్ని, సమానత్వాన్ని కోరుకునేవారంతా బిల్లుకు మద్దతు ఇవ్వాలని మంత్రి కోరారు. అనంతరం అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు తెలిపారు. సభ్యులంతా మద్దతు తెలపడంతో మండలి చైర్మన్ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు.

వర్గీకరణ బిల్లును స్వాగతిస్తున్నం 

ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ.. వర్గీకరణను శాస్త్రీయంగా చేయాలని సుప్రీం కోర్టు సూచించిందన్నారు. వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణను స్వాగతించారు. ప్రస్తుతం 15 శాతం రిజర్వేషన్ తో వర్గీకరణ చేస్తున్నా.. ఫ్యూచర్ లో 18 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మధుసూదన చారి మాట్లాడుతూ.. వర్గీకరణపై వస్తున్న ఆపోహలను, అనుమాలను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 

కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. షమీమ్ అక్తర్ రిపోర్టు బయటపెట్టకుండా.. శాస్త్రీయంగా వర్గీకరణ చేశామనడం సరికాదన్నారు. బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. మూడు దశబ్దాల సమస్యకు పరిష్కారం చూపిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సత్యవతిరాథోడ్ మాట్లాడుతూ.. గిరిజన బిడ్డగా ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు ఇస్తున్నట్టు చెప్పారు. ఎంఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ చాలా సున్నితమైన అంశమన్నారు. విద్యా, ఉద్యోగ, సంక్షేమ పథకాలలో ఏ ఉపకులాలు ఎక్కువ లబ్ధి పొందాయో, ఏ ఉప కులాలు నష్ట పోయాయో స్టడీ చేసిన తరువాత వర్గీకరణపై నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు సూచించిందన్నారు.