ఆమెకు ఇంగ్లిష్, ఉర్దూ రాదు.. మంత్రి సీతక్కపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు

ఆమెకు ఇంగ్లిష్, ఉర్దూ రాదు.. మంత్రి సీతక్కపై అక్బరుద్దీన్ వ్యాఖ్యలు

హైదరాబాద్​, వెలుగు: భాషపై ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్​ ఒవైసీ, మంత్రి సీతక్క మధ్య గరం గరం సంభాషణ నడిచింది. బుధవారం అసెంబ్లీలో భూభారతి, ఇండ్ల గురించి అక్బరుద్దీన్​ ఒవైసీ మాట్లాడుతుండగా.. సీతక్క క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, తాను చెప్పేది సీతక్కకు అర్థం కావడం లేదంటూ అక్బరుద్దీన్​ వ్యాఖ్యానించారు. 

ఆమెకేమో ఉర్దూ, ఇంగ్లిష్​ రాదని.. తాను చెప్పేది అర్థం కాదని.. తనకేమో తెలుగు రాదని ఆయన అన్నారు. ‘‘నేను చెప్పేది వారికి అర్థం కాకుంటే సారీ చెప్పడం తప్ప నేను చేసేదేమీ లేదు” అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మంత్రి సీతక్క స్పందిస్తూ.. కాంగ్రెస్​ ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదంటూ విమర్శలు గుప్పించారే తప్ప తాము ఏమేం ఇచ్చామో మాత్రం తెలుసుకోలేకపోయారని అన్నారు. ‘‘ఔను.. నాకు ఇంగ్లిష్​, హిందీ రాదు.. గూడెంలో పుట్టి పెరిగిన. నా మాతృభాష తెలుగు” అని కౌంటర్​ ఇచ్చారు. 

పోలీస్​ వ్యవస్థను మొత్తం కించపరిచేలా ఒవైసీ మాట్లాడుతున్నారని, గత పదేండ్ల కోపాన్ని పదినెలల తమ ప్రభుత్వంపై తీయొద్దని సూచించారు.  మళ్లీ ఒవైసీ మాట్లాడుతూ.. తాను మొత్తం పోలీస్​ వ్యవస్థను తప్పుబట్టడం లేదన్నారు. ‘‘సీతక్క అంటే నాకు చాలా గౌరవం ఉంది.  ఆమె చాలా కష్టపడి పైకొచ్చారు. అయితే, గత ఒక్క ఏడాదిలోనే రాష్ట్రంలో రేప్​ కేసులు భారీగా పెరిగాయి. కిడ్నాప్​లు, నేరాలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాన్ని సంతృప్తి పరచడం కోసం నేను మాట్లాడను. ప్రజల కోసం మాట్లాడుతా” అని అన్నారు. ఇందుకు సీతక్క మళ్లీ కౌంటర్​ ఇచ్చారు. గత పదేండ్లలో లక్షకుపైగా నేరాలు జరిగాయని, వాటిని ఎలా నివారించాలో చెప్పాలేగానీ.. ప్రభుత్వంపై నిందలు మోపడం తగదన్నారు. తాను కూడా ప్రజల కోసమే ఆలోచిస్తానని, మహిళలపై జరుగుతున్న నేరాలపై 
రిపోర్టులు తెప్పించుకుని రివ్యూ చేస్తున్నామని తెలిపారు.