- ఉదయం 10.30 గంటలకు ప్రారంభం.. తొలి రోజు అద్ద గంటలోపే
- అనంతరం బీఏసీ మీటింగ్.. ఎన్నిరోజులు సమావేశాలు జరపాలనేదానిపై నిర్ణయం
- ఆర్వోఆర్ చట్టం, రైతు భరోసా, రుణమాఫీ, కులగణనపై అసెంబ్లీలో చర్చించే చాన్స్
- విద్యుత్ కమిషన్ రిపోర్ట్, ఏడాది పాలనపైనా డిస్కషన్!
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు అద్దగంటలోపే సమావేశం జరగనుంది. ఆ తర్వాత బీఏసీ మీటింగ్ ఉంటుంది. అందులో చర్చించి ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. కాగా, ఈ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో పలు కీలక చట్టాలను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో కొత్త ఆర్వోఆర్ చట్టం–-2024 కూడా ఉంది.
గత అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్వోఆర్ డ్రాఫ్ట్‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనిపై అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి మేధావులు, రైతుల అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. దానికి తగ్గట్టు డ్రాఫ్ట్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు.
గ్రామానికో రెవెన్యూ సంబధిత అధికారిని నియమించుకోవడం, సరిపడా సర్వేయర్ల నియామకం చేపట్టడం వంటి వాటిపైన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఇక, సమగ్ర కులగణన సర్వేపైనా ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించనుంది. ఇప్పటికే కులగణన వివరాల సేకరణ పూర్తయింది.
డిజిటలైజేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావస్తున్నది. దీంతో కులగణన వివరాలను అసెంబ్లీలో ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపైన , పంచాయతీ ఎన్నికలు వంటి వాటిపైనా చర్చించనున్నట్లు సమాచారం.
ఏడాది పాలనపై చర్చ!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయింది. ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం చర్చ పెట్టనున్నట్లు తెలుస్తున్నది. రుణమాఫీ, రైతు భరోసా, ఏడాది రైతు సంక్షేమంపైనా డిస్కస్ చేయనున్నట్లు సమాచారం. రైతు భరోసాపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అన్ని జిల్లాల్లో రైతులతో సమావేశాలు నిర్వహించి నివేదికను రెడీ చేసింది. దీనిపై అసెంబ్లీలో చర్చించి విధివిధానాలు ఖరారు చేయనున్నారు. కాగా.. హైడ్రా, మూసీ ప్రక్షాళన, రైతు భరోసా, రుణమాఫీ, కాంగ్రెస్ హామీలు, గ్యారంటీలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ రెడీ అయ్యాయి. గురుకులాల్లోని ఫుడ్ పాయిజన్ కేసులు, లగచర్ల ఘటన వంటి అంశాలపైనా చర్చకు పట్టుపట్టే అవకాశం కనిపిస్తున్నది.
రెండు కొత్త బిల్లులు
సమావేశాల్లో రెండు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్) బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. గతంలో ఇద్దరు వరకు సంతానం ఉన్న వారికి మాత్రమే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండేది. అయితే ప్రభుత్వం దీనిని సవరించి ముగ్గురు సంతానం ఉన్నా పోటీ చేసే అవకాశం కల్పించనుంది.
ఈసారైనా కేసీఆర్ వస్తరా?
అసెంబ్లీకి ఈసారైనా మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ వస్తరా.. రారా అన్న చర్చ మళ్లీ మొదలైంది. ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను పదే పదే సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానిస్తున్నారు. అధికార పక్షానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని.. ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇరుకునపెట్టాలని.. అసెంబ్లీలో ఇలాంటి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని కేసీఆర్‌ను ఆయన కోరుతున్నారు.