- నామ్ కే వాస్తేగా మారుతున్న సమావేశాలు
- ఏటా తగ్గిపోతున్న పనిదినాలు.. ప్రజా సమస్యలపై చర్చే లేదు
- కేవలం రూల్స్ కోసం అసెంబ్లీని సమావేశపరుస్తున్న సర్కారు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడిగా మారాయి. ఏటేటా సభ జరిగే రోజులు తగ్గిపోతున్నాయి. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఆరు నెలలకోసారి అసెంబ్లీ సమావేశం కావాల్సి ఉంటుంది. ఒకవేళ ఆరు నెలల్లోపు సమావేశపరచకపోతే శాసనసభ రద్దు అవుతుంది. రాజ్యాంగంలోని ఈ నిబంధనకు లోబడే ప్రస్తుతం తెలంగాణ రెండో అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు కొద్దిగా ఫర్వాలేదని అనిపించినా రెండో అసెంబ్లీ సమావేశాలు మాత్రం కేవలం రాజ్యాంగంలోని నిబంధనల మేరకే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కూడా ఏడాది క్రితం నాటి సెషన్‌కు కొనసాగింపుగా సభను సమావేశపరచనున్నారు. ఈ విడత అసెంబ్లీ సమావేశాలు మూడు రోజులు మాత్రమే ఉంటాయని టీఆర్‌ఎస్ ఎల్పీ మీటింగ్‌లో సీఎం కేసీఆర్ ఇండికేషన్ ఇచ్చారు. అయితే తుది నిర్ణయం బీఏసీ తీసుకుంటుందని తెలిపారు.
మూడేండ్లలో 59 రోజులే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ కాల వ్యవధి ముగిసేలోగా కనీసం 200 రోజులు సభను నిర్వహించేవారు. ఏటా బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరిగేవి. ఒక్కో సెషన్ 15 నుంచి 20 రోజుల పాటు నడిచేది. సభలో అధికారపక్ష సభ్యులకన్నా ప్రతిపక్షానికి ఎక్కువగా మాట్లాడే చాన్స్ ఇచ్చేవారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. 2014 నవంబర్‌లో నిర్వహించిన శీతాకాల సమావేశాలు అత్యధికంగా 19 రోజులు జరిగాయి. తెలంగాణ తొలి అసెంబ్లీ (2014 – 2018) సమావేశాలు 126 రోజులు జరిగాయి. రెండో అసెంబ్లీ (2018 నుంచి 2022 మార్చి వరకు) సమావేశాలు కేవలం 59 రోజులే నడిచాయి. మరో 16 నెలల్లో అసెంబ్లీ కాలవ్యవధి ముగియనుంది. ఈలోగా మూడుసార్లు అసెంబ్లీని సమావేశపరిచినా ఇంకో 40 రోజులకు మించి సభ నడిచే సూచనలు కనిపించడం లేదు.
గవర్నర్ ప్రసంగం లేకుండానే..
క్యాలెండర్ ఇయర్‌లో నిర్వహించే మొదటి సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. 2021 మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళిసై.. అసెంబ్లీ, కౌన్సిల్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఏడాది మార్చిలో బడ్జెట్ కోసం అసెంబ్లీ పెట్టినా.. 2021లో జరిగిన ఎనిమిదో సెషన్‌కు కొనసాగింపుగానే రెండో మీటింగ్ నిర్వహిస్తున్నామంటూ టెక్నికల్‌గా గవర్నర్ ప్రసంగం లేకుండా చేశారు. ఇప్పుడు అసెంబ్లీని సమావేశపరుస్తున్నా ఎనిమిదో సెషన్ మూడో మీటింగ్‌గానే సభ పెడుతుండటంతో ఈసారీ గవర్నర్ స్పీచ్ లేదు. ఈ సమావేశాల తర్వాత అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుంటే వచ్చే ఏడాది కూడా బడ్జెట్ సెషన్ ప్రసంగం ఉండే అవకాశం లేదు.
అయితే పొగడ్తలు.. లేదంటే విమర్శలు
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యల కన్నా ఎక్కువగా వ్యక్తిపూజ.. ప్రతిపక్షాలు, సభలో లేని వ్యక్తులపై ఎదురుదాడికే ప్రాధాన్యమిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలోనూ ఇలాంటి ధోరణి కనిపించినా.. తెలంగాణ ఏర్పడిన తర్వాత పొగడ్తలు, విమర్శలు ఎక్కువయ్యాయి. సభలో సంఖ్యాబలాన్ని సాకుగా చూపించి ప్రతిపక్షాలకు మాట్లాడే టైం తక్కువగా ఇస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీజేపీ పక్షనేత రాజాసింగ్ వెల్‌లోకి దూసుకెళ్లారని.. ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను మొత్తం సెషన్ నుంచి బహిష్కరించారు. గతంలో షిమ్లాలో జరిగిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ సమ్మిట్‌లో ఏడాదికి కనీసం 100 రోజులు చట్టసభలు నడవాలని సూత్రపాయంగా నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత నిర్వహించిన తొలి బీఏసీ సమావేశంలో ఏటా 60 వర్కింగ్ డేస్‌కు తగ్గకుండా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. కానీ తెలంగాణ రెండో అసెంబ్లీ తొలి మూడున్నరేండ్లలో కలిపి కూడా 60 రోజులు సభ జరగకపోవడం గమనార్హం.
పది రోజులకు మించుతలే
2018 డిసెంబర్ 13న రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2019 జనవరిలో అసెంబ్లీని సమావేశపరిచి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ విడతలో సభ నాలుగు రోజులు నడిచింది. ఫిబ్రవరిలో మూడు రోజులు, జులైలో రెండు రోజులు, సెప్టెంబర్‌లో పది రోజులు సమావేశాలు నడిచాయి. ఇలా మొదటి ఏడాది (నాలుగు సెషన్లలో కలిపి) 19 రోజులు సభ సమావేశమైంది. 2020 మార్చిలో కరోనా నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలను 8 రోజులకే ముగించారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో 8 రోజులు వర్షాకాల సమావేశాలు నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ యాక్ట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ యాక్ట్ సహా పలు బిల్లులను ఆమోదించేందుకు అక్టోబర్ 13న మరో రోజు అసెంబ్లీని సమావేశపరిచారు. 2021 మార్చిలో బడ్జెట్ సమావేశాలు 9 రోజులు ఏర్పాటు చేశారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో వర్షాకాల సమావేశాలు ఏడు రోజులు నిర్వహించారు. అదే సెషన్‌కు కొనసాగింపుగా (ఎనిమిదో సెషన్ సెకండ్ మీటింగ్) 2022 మార్చిలో ఏడు రోజులు అసెంబ్లీని సమావేశపరిచి బడ్జెట్ ప్రవేశపెట్టి, ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశాలు మార్చి 15తో ముగిశాయి. ఆ రోజు నుంచి ఆరు నెలల్లోగా అంటే ఈనెల 14లోగా అసెంబ్లీని సమావేశపరచాల్సి ఉంది. ఈనెల ఆరో తేదీ నుంచి గత సమావేశాలకు కొనసాగింపు మూడో మీటింగ్ నిర్వహించనున్నారు.