- కీలక బిల్లుల ఆమోదానికి సిద్ధమవుతున్న సర్కార్
- మూసీ పునరుజ్జీవంపై చర్చించే చాన్స్
- ఎంపీలనూ ప్రత్యేక ఆహ్వానితులుగా చేర్చే యోచన
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. కీలకమైన బిల్లులకు ఆమోదం తెలపడంతో పాటు ప్రధాన అంశాలపై అసెంబ్లీలో చర్చించనున్నారు. వాస్తవానికి అక్టోబర్ చివరి వారంలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సర్కార్ భావించింది. అయితే, ఈ నెల మొదటి వారంలో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్పర్సన్, ఇతర అధికారులు విదేశీ పర్యటనకు వెళ్లారు.
దీంతో అసెంబ్లీ నిర్వహణ వాయిదా పడింది. వచ్చే నెల మొదటి వారంలో అసెంబ్లీ సమావేశపర్చాలని సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకురానున్నారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతరత్రా వాటికోసం త్వరలో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ప్రజా విజయోత్సవ సభలను ప్రభుత్వం నిర్వహిస్తున్నది. ఏడాదిలో చేపట్టిన కార్యక్రమాలపైనా అసెంబ్లీలోనూ చర్చించనున్నారు. లగచర్ల ఘటన, భూసేకరణలో గత ప్రభుత్వం అమలు చేసిన విధానాలు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని సమావేశాల్లో స్పష్టం చేసేందుకు సిద్ధమవుతున్నది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్వోఆర్–2024 బిల్లుకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, మూసీ పునరుజ్జీవంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో మారోమారు చర్చకు పెట్టాలని అనుకుంటున్నది. ఆల్ పార్టీ మీటింగ్ పెడ్తామని.. సలహాలు, సూచనలివ్వాలని పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దాని బదులు అసెంబ్లీలోనే మూసీ పునరుజ్జీవంపై మాట్లాడాలని నిర్ణయం తీసుకోవడం.. అవసరమైతే ప్రత్యేక ఆహ్వానితుల కింద ఎంపీలనూ సభలో చర్చకు పిలిచే అంశంపైనా ప్రభుత్వం పరిశీలిస్తున్నది. ఫోర్త్ సిటీ ఏర్పాటుపైనా చర్చించనున్నట్టు తెలిసింది. హైడ్రాకు అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్తెచ్చారు. దీనికి సంబంధించి కూడా ఆయా చట్టాలకు అసెంబ్లీలో బిల్లు పెట్టి సవరించనున్నారు. ఇక సాగు భూములకే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రైతుభరోసాపైనా చర్చించే అవకాశం ఉన్నది.