తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. 2024, జూలై 23వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 24వ తేదీ నుంచి మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. 25వ తేదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది ప్రభుత్వం.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 25 రాష్ట్ర పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. . ఈ సమావేశాల సందర్భంగా రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై వాడివేడిగా సమావేశాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే నూతన ఆర్‌ఓఆర్ యాక్ట్, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలపై కూడా ప్రతిపక్షాలు సమావేశంలో ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది.
గత అసెంబ్లీ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ డుమ్మా కొట్టారు. కానీ, ఈ సారి సమావేశాలకు తాను హాజరవుతానని ఇటీవలే ప్రకటించడంతో.. రాబోయే సమావేశాలపై ఆసక్తి నెలకొంది. దాదాపు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వలసలు జరుగుతాయనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఫిరాయింపుల చట్టంపై చర్చించే అవకాశం ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వైపు ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే మరోవైపు రాహుల్ గాంధీ అదే చట్టాన్ని కీర్తిస్తూ మాట్లాడుతారని, ఫిరాయింపుల చట్టాన్ని బలోపేతం చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిందనే వాదనలను బీఆర్ఎస్ ముందుకు తెచ్చే అవకాశం ఉన్నది. . కాంగ్రెస్ ఎన్నికల్లో ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలుపైనా ప్రశ్నలు గుప్పించే అవకాశం ఉన్నది.ఇప్పటికే సింహభాగం గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసినప్పటికీ ఇంకా గృహలక్ష్మీ కింద మహిళకు రూ. 2,500 అందించేటువంటి కొన్ని గ్యారెంటీలు పెండింగ్‌లోనే ఉన్నాయి.