
= సస్పెండ్ చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనలు
= వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
= సభ్యత్వం రద్దు చేయాలని కోరిన మంత్రి సీతక్క
= ఎథిక్స్ కమిటీకి పంపుతామన్న డిప్యూటీ సీఎం భట్టి
= సభలో ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డిపై బడ్జెట్ సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్ వేటు పడింది. స్పీకర్ చైర్ ను అవమాన పర్చేలా వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రిపై వేటు వేయాలని ప్రతిపాదిస్తూ శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తీర్మానం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదంతో స్పీకర్ నిర్ణయాన్ని అమలు చేశారు. ఇవాళ ఉదయం సభ ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ ను నువ్వు అని సంబోధించారని పేర్కొంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది.
ఈ క్రమంలో జగదీశ్ రెడ్డి ‘సభ మీ సొంతం కాదు సభ అందరిదీ కాదు సభకు మీరు పెద్ద మనిషి మాత్రమే’ అని స్పీకర్ ను ఉద్దేశించి వ్యాఖ్య చేశారు. దళిత స్పీకర్ ను కావాలని అవమానించారని పేర్కొంటూ కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన స్పీకర్ తన చాంబర్ కు వెళ్లిపోయారు. సభ వాయిదా పడిన మూడున్నర గంటల తర్వాత తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్బంగా కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదం కొనసాగింది. స్పీకర్ ను ఏక వచనం తో మాట్లాడటం బాధాకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆయన అహంకారంతో వ్యవహరించారని చెప్పారు. అసెంబ్లీ ఎథిక్ కమిటీకి రెఫర్ చేసి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. అందరం సభా మర్యాదలు కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సభా పతి హక్కులను కాపాడటం అందరి బాధ్యతని అన్నారు. సభను నడిపే సర్వ హక్కులు స్పీకర్ కు భారత రాజ్యాంగం కల్పించిందని అన్నారు. స్పీకర్ ను ఏక వచనం తో మాట్లాడడం చాలా బాధ కలిగించాయన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ జగదీశ్ రెడ్డి సభ్యత్వం రద్దు చేయాలని కోరారని, ఎథిక్స్ కమిటీకి పంపి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఇవాళ ఉదయం జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. స్పీకర్ స్థానాన్ని అవమాన పర్చడమేనని, సభా మర్యాదలు పాటించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడి మీదా ఉందన్నారు. రూల్ బుక్ ఆధారంగానే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయాలని ప్రతిపాదించారు.