- మన్మోహన్ సింగ్ మృతిపై సభ్యుల సంతాపం
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ప్రత్యేక సెషన్ సోమవారం జరగనున్నది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు సభ్యులు సంతాపం తెలియజేయనున్నారు. సెషన్‌కు సంబంధించిన ఏర్పాట్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, సెక్రటరీ నర్సింహా చార్యులు ఆదివారం పరిశీలించారు. సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సెక్రటరీని స్పీకర్ ఆదేశించారు. సంతాపం తెలియజేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
తర్వాత సీఎస్ శాంతి కుమారి, డీజీపీ జితేందర్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, ఇతర అధికారులతో స్పీకర్ ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులంతా సమన్వయం చేసుకుని ప్రశాంత వాతావరణంలో సెషన్ జరిగేలా చూడాలని సూచించారు. సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే ఫ్లోర్ లీడర్ హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. కాంగ్రెస్,
బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సభ్యులు మాట్లాడిన తర్వాత సభను వాయిదా వేయనున్నారు.