- అదేరోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ
- ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు
- మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం
- కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు
- చోటు దక్కకపోవడంపై తీవ్ర అసహనం
- ఎమ్మెల్సీ, పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం
- స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కారు అడుగులు
హైదరాబాద్, వెలుగు: స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులేస్తున్న రాష్ట్ర సర్కారు.. బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చేందుకు సిద్ధమైంది. ఆదివారం కేబినెట్ సబ్ కమిటీ ముందుకు కులగణన రిపోర్ట్ రానుంది. ప్లానింగ్కమిషన్అందించే ఈ నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆది, సోమవారాల్లో చర్చ జరుగుతుంది. అనంతరం ఈ నెల 5న రాష్ట్ర కేబినెట్లో చర్చించి ఆమోదిస్తారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై కులగణన తోపాటు ఎస్సీ వర్గీకరణ నివేదికపైనా చర్చించనుంది. బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్న ప్రభుత్వం, ఎస్సీ వర్గీకరణపైనా ప్రకటన చేయనున్నట్టు తెలిసింది. శనివారం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
మంత్రులతో సీఎం సుదీర్ఘ సమావేశం..
శనివారం ఉదయమే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న సీఎం రేవంత్.. మంత్రులు, ఆర్థిక శాఖ అధికారులతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి వచ్చే నిధులపై చర్చించారు. బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు చోటుదక్కకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తంచేసిన సీఎం.. కేంద్ర సర్కారుకు రాష్ట్ర ప్రభుత్వం తరుఫున నిరసన తెలియజేయాలని నిర్ణయించారు. అనంతరం త్వరలో జరగనున్న లోకల్‌బాడీ, ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌పై చర్చించారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై తేల్చడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లను సీఎం ఆదేశించారు. తెలంగాణ చేపట్టిన కులగణనపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా కేబినెట్ లో, అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధికారులకు సీఎం సూచించారు.
దీంతో శనివారం సాయంత్రం కల్లా పరిణామాలు చకచకా మారిపోయాయి. కులగణన నివేదిక రెడీ అయిందని తెలియగానే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్సబ్కమిటీ సమావేశం ఏర్పాటుచేశారు. ప్లానింగ్‌కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా అందించే కులగణన నివేదికపై సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాంబర్లో ఆయనతోపాటు కో -చైర్మన్ దామోదర రాజానర్సింహ, సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ మల్లు రవి హాజరై ఆది, సోమవారాల్లో చర్చిస్తారు. అనంతరం కేబినెట్సబ్ కమిటీ ఈ రిపోర్ట్‌ను 5వ తేదీ ఉదయం జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం కోసం పంపుతుంది. కేబినెట్ ఆమోదం అనంతరం అదే రోజు మధ్యాహ్నం నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో కులగణన తుది నివేదికను ప్రభుత్వం ప్రవేశపెడ్తుంది. శాసనసభలో దానిపై చర్చించి.. తీర్మానం చేసి దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కేంద్రానికి పంపిస్తుంది. అదే సమయంలో లోకల్‌బాడీ ఎన్నికల్లో అమలుచేయనున్న బీసీ రిజర్వేషన్లపైనా ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి జ్యుడీషియల్ కమిషన్ ఇచ్చిన నివేదికను కూడా మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి.. అసెంబ్లీలో ప్రకటన చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.
కేంద్ర బడ్జెట్ పై పెదవి విరుపు.. రాష్ట్ర బడ్జెట్‌పై సమీక్ష
కేంద్ర బడ్జెట్‌పై ఆర్థికశాఖ అధికారుల ద్వారా సీఎం అన్ని కోణాల్లో ఆరా తీశారు. రాష్ట్రానికి వాటాగా వచ్చే నిధులే తప్ప ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు లేవని తెలియడంతో కేంద్రం తీరుపై రేవంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్ని ప్రతిపాదనలు పంపినా పక్కకు పెట్టడంపై నిరసస తెలపాలని నిర్ణయించారు. అనంతరం రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌ల కింద రూ.5 వేల కోట్లే వచ్చినట్టు అధికారులు వివరించారు. ఈ క్వార్టర్లో ఇంకో రూ.1,500 కోట్లు వస్తాయని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి కూడా ఆశించిన మేర పన్ను, పన్నేతర ఆదాయం రాలేదని అధికారులు వెల్లడించారు. అనుకున్న లక్ష్యంతో కనీసం 85–90 శాతం కూడా రీచ్ కాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు.
మంత్రులూ విమర్శలు రావొద్దు
టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపైనా సీఎం చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలతో మంత్రులకు గ్యాప్ ఉండొద్దని, విమర్శలకు తావు లేకుండా పనిచేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కొందరు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపైనా సీఎం గుస్సా అయినట్టు తెలిసింది. మంత్రులు తీరుమార్చుకోకపోతే ప్రభుత్వం మొత్తం బద్నాం అవుతుందని చెప్పినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లోనూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని, ఈ విషయంలో క్యాడర్‌తో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, దామోదర్‌రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.