తెలంగాణ అసెంబ్లీలో రైతు భరోసాపై వాడివేడిగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ,బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 24 గంటల కరెంట్ ఇచ్చినట్లు నిరూపిస్తే తమ పదవులకు రాజీనామా చేస్తామని మంత్రి కోమటి రెడ్డి.. కేటీఆర్ ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. దేశంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగిందన్నారు. నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేశామన్నారు.
అయితే కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి.. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదని లాగ్ బుక్ తెచ్చి చూపిస్తా. దేశంలో ఉచిత కరెంట్ ముమ్మాటికీ కాంగ్రెస్ దే. జగన్ తో దోస్తీ చేసి కృష్ణా నీళ్లు ఏపీకి అప్పగించారు. దళితులకు 3 ఎకరాలు ఇస్తానని మోసం చేసింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో వందేళ్లు వెనక్కి తీసుకెళ్లారు. కేటీఆర్ అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారు. నాగార్జున సాగర్ కేటీఆర్ కట్టిండా వాళ్ల నాయన కట్టిండా. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లియ్యలేదు. 50 ఏళ్లలో కాంగ్రెస్ ఎన్నో ప్రాజెక్టులు కట్టింది. లక్ష రూపాయల రుణమాఫీ ఏళ్లకు ఏళ్లు కొనసాగించారు. బీఆర్ఎస్ హయాంలో నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరాకు అదనంగా నీళ్లిచ్చినట్టు నిరూపించినా నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని కోమటి రెడ్డి కేటీఆర్ కు సవాల్ విసిరారు.
ALSO READ : మర్యాద ఇచ్చి మాట్లాడాలి కేటీఆర్ : స్పీకర్ సూచనతో తగ్గిన ఎమ్మెల్యే
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలకు రీ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్.. బీఆర్ఎస్ హయాంలో యావరేజ్ గా 19 గంటల కరెంట్ ఇచ్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఇపుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తామని సవాల్ విసిరారు. నల్గొండ గతంలో ఎలా ఉంది..ఇపుడు ఎలా ఉందని ప్రశ్నించారు. నల్గొండ ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు.