డిసెంబర్ 9 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: వచ్చే నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా రెవెన్యూ సంస్కరణల్లో కీలకమైన ఆర్వోఆర్ చట్టాన్ని ఆమోదిస్తారు. దీని ద్వారా భూ సమస్యలకు చెక్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణనపై చర్చించి ఆమెదించనున్నారు. దీని ఆధారంగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఖరారయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రైతు భరోసా, ఆసరా పింఛన్ల పెంపుపైనా అసెంబ్లీలో తీర్మానించే అవకాశం ఉంది. 

‘మహా’ ఫలితాల తర్వాతే కేబినెట్ విస్తరణ

మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాతే కేబినెట్ విస్తరణ ఉంటుందని సమాచారం. డిసెంబర్ 7వ తేదీతో రేవంత్ సర్కారు కొలువు దీరి ఏడాది పూర్తవుతుంది. ఆలోపే కేబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఈ జిల్లాకు చెందిన నాయకులను క్యాబినెట్‎లోకి తీసుకొనే అవకాశం ఉంది.