
జాతీయ బాక్సింగ్ చాంపియన్
జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో తెలంగాణ క్రీడాకారిణి నిఖత్ జరీన్ సత్తా చాటింది. ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణంతో మెరిసిన నిఖత్, జాతీయ టోర్నీలో 50 కేజీల ఫైనల్లో 4-1తో అనామిక (ఆర్‌ఎస్‌పీబీ)పై నెగ్గి గోల్డ్ మెడల్ సాధించింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ప్లేయర్ ఆఫ్ ది మంత్ నవంబర్ 2022 అవార్డులను ఐసీసీ ప్రకటించింది. మెన్స్ విభాగంలో ఇంగ్లండ్ వన్డే, టీ 20 జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ అందుకున్నాడు. మహిళల విభాగంలో పాకిస్థాన్ కు చెందిన సిద్రా అమీన్ ఎంపికైంది.
ఫిజీ నూతన ప్రధానిగా రబూకా
ఫిజీ నూతన ప్రధానమంత్రిగా సితవేని రబూకా బాధ్యతలు స్వీకరించారు. 74 ఏళ్ల ఈ మాజీ సైనిక కమాండర్ పార్లమెంట్ సభ్యుల మధ్య జరిగిన రహస్య ఓటింగ్‌లో కేవలం ఒకే ఒక్క ఓటు తేడాతో నెగ్గి గత 16 ఏళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న ఫ్రాంక్ బైనిమారామాను అధికారానికి దూరం చేశారు.
పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా అఫ్రిది
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాత్కాలిక చీఫ్ సెలెక్టర్‌గా మాజీ స్టార్ ప్లేయర్ షాహిద్ అఫ్రిది నియమితుడయ్యాడు. ఈ తాత్కాలిక సెలక్షన్ కమిటీలో అబ్దుల్ రజాక్, ఇఫ్తికార్ అహ్మద్, హరూన్ రషీద్ ఉన్నారు.
కార్ల్‌సన్‌కు ర్యాపిడ్ చెస్ టైటిల్
ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే) 10 పాయింట్లతో ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఓపెన్ విభాగంలో టైటిల్ గెలిచాడు. విన్సెంట్ (జర్మనీ) 9.5 పాయింట్లతో రెండో స్థానం సాధించాడు.
ఇజ్రాయెల్ ప్రధానిగా మళ్లీ నెతన్యాహు
ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా బెంజమిన్ నెతన్యాహు ఆరోసారి ప్రమాణం చేశారు. బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు.
నేపాల్ ప్రధానిగా ప్రచండ
సీపీఎన్- మావోయిస్టు సెంటర్ (ఎంసీ) పార్టీ ఛైర్మన్ పుష్పకమల్ దహాల్ ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధానిగా ప్రమాణం చేశారు. గెరిల్లా ఉద్యమ నేతగా పేరొందిన ఆయనతో దేశాధ్యక్షురాలు బిద్యాదేవి భండారీ ప్రమాణం చేయించారు. ప్రచండతో పాటు కొత్త సంకీర్ణ ప్రభుత్వంలోని కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు.
రిచర్డ్ వర్మ
భారత సంతతి లాయర్, మాజీ దౌత్యవేత్త రిచర్డ్ వర్మను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాంగ శాఖలో డిప్యూటీ కార్యదర్శి (నిర్వహణ, వనరుల విభాగం)గా నామినేట్ చేశారు. రిచర్డ్ వర్మ, ఒబామా హయాంలోనూ విదేశాంగ శాఖలో ఉప కార్యదర్శి (న్యాయ వ్యవహారాలు)గా పనిచేశారు.
సానియా మీర్జా
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సానియా మీర్జా తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ఎన్డీఏ పరీక్షలో 149వ ర్యాంక్ సాధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్ కానున్న సానియా మీర్జా దేశంలోనే తొలి ముస్లిం మహిళా ఫైటర్ పైలట్‌గా రికార్డ్ సృష్టించనున్నారు.
బూర రాజేశ్వరి
కాళ్లతో కవిత్వం రాసిన కవయిత్రి బూర రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందారు. వైకల్యంతో జన్మించిన ఆమె ఐదు వందలకు పైగా రాసిన కవితలను సుద్దాల అశోక్ తేజ పుస్తకంగా ప్రింట్ చేయించారు. కాళ్లతోనే కవిత్వం రాసే స్ఫూర్తికి ప్రభావితమైన మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి పాఠ్యాంశాల్లో ఆమె జీవితగాథను చేర్చింది.
అనిల్‌కుమార్ లాహోటీ
రైల్వే బోర్డు చైర్మన్, సీఈవోగా అనిల్‌కుమార్ లాహోటీని నియమిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించినట్లు కార్యదర్శి దీప్తి ఉమాశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ప్రస్తుతం రైల్వే బోర్డు సభ్యుడి (మౌలిక వసతులు)గా పని చేస్తున్నారు.
ప్రవీణ్‌కుమార్ శ్రీవాస్తవ
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్‌గా (సీవీసీ) విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవను తాత్కాలికంగా నియమించారు. సంస్థ కమిషనర్ అయిన సురేష్ ఎన్ పటేల్ పదవీ కాలం డిసెంబర్ 24తో ముగిసింది.
తొలిసారి తెలంగాణకు రాష్ట్రపతి
దేశాధినేత పదవిని చేపట్టిన తరువాత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము డిసెంబర్ 26న తొలిసారి శీతాకాల విడిదిలో భాగంగా తెలంగాణకు రాష్ట్రపతి వచ్చారు.
ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీకుమార్
తెలంగాణ ఇన్‌చార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియమితులయ్యారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్‌ను సీఐడీ చీఫ్‌గా, రాచకొండ సీపీగా దేవేంద్ర సింగ్ చౌహాన్, ఏసీబీ డీజీగా రవిగుప్త నియమితులయ్యారు.
400 కిలోమీటర్లకు పెరిగిన బ్రహ్మోస్ రేంజ్
బ్రహ్మోస్ క్షిపణి సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణశాఖ పేర్కొంది. బ్రహ్మోస్ పరిధిని మరింతగా పెంచి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఢీకొట్టేలా చేశారు.
విశాఖ వేదికగా ‘జీ–20 సదస్సు’
జీ–20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3, 4 తేదీల్లో, ఏప్రిల్ 24న విశాఖ వేదికగా సదస్సు నిర్వహించనుంది.
కోవిడ్ నాసికా టీకా
ముక్కు ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్ ఇంకోవాక్ ధరను దాని తయారీదారు భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రభుత్వ కోవిన్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉండే
ఈ నాసికా వ్యాక్సిన్‌ను రూ.800కు అందివ్వనున్నట్లు తెలిపింది. జనవరి నాలుగో వారంలో దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తారు.
జోగులాంబ ఆలయానికి అవార్డు
అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన ఆలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు–2022 దక్కింది.