హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 7న ఒక రోజు తలపెట్టిన రాష్ట్ర బంద్ యథాతథంగా కొనసాగుతోందని, తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ తెలిపింది. ఈ బంద్పై కొన్ని ఆటో సంఘాల నాయకులు బంద్ లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. జేఏసీ కన్వీనర్ వెంకటేశం హిమాయత్ నగర్ ఏఐటీయూసీ భవన్లో వెల్లడించారు.
ఆటో డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లే.. రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాట్ల బంద్కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఆందోళనలో భాగంగా సీపీఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలవడం జరిగిందని వివరించారు. ఆటో డ్రైవర్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈనెల 6న ఆటో సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరుపుతామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. 6న మంత్రి నుంచి స్పష్టమైన హామీ వస్తేనే బంద్ విరమిస్తామని.. లేకపోతే తమ ఆందోళన ఉధృతం చేస్తామని వెంకటేశం హెచ్చరించారు.