ప్రభుత్వంతో మా చర్చలు సఫలం...తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ వెల్లడి

ప్రభుత్వంతో మా చర్చలు సఫలం...తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ వెల్లడి

బషీర్​బాగ్, వెలుగు: ప్రభుత్వంతో తమ చర్చలు సఫలమైనట్లు తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్స్ జేఏసీ వెల్లడించింది. హిమాయత్‌‌‌‌ నగర్​లోని ఏఐటీయూ భవన్​లో జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం శుక్రవారం మాట్లాడారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం సమక్షంలో ఆటోసంఘాల జేఏసీ సమావేశం గురువారం జరిగిందని, తమ న్యాయమైన సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు.

జేఏసీ నిర్ణయం మేరకు ఉద్యమ కార్యక్రమాలన్నీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న రూ.12 వేలను త్వరలోనే ప్రభుత్వ వెసులుబాటు ప్రకారం చెల్లిస్తామని మంత్రి తెలిపారన్నారు. అలాగే ఆటో రవాణా రంగం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు  ప్రభుత్వం సానుకూలంగా ఉన్నదన్నారు. ఓలా, ఊబర్‌‌‌‌, రాపిడోల నుంచి డ్రైవర్లను రక్షించడానికి ప్రభుత్వమే ఒక యాప్‌‌‌‌ను తీసుకురావటానికి కృషి చేస్తుందని, గతంలో ఉన్న యాక్సిడెంటల్‌‌‌‌ బీమాను పునరుద్ధరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఆటోల పార్కింగ్‌‌‌‌ స్థలాలకు సంబంధించి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయో వాటిని గుర్తించి ఏర్పాటు చేస్తామని, అక్రమంగా నడుస్తున్న ఓలా, ఊబర్‌‌‌‌, రాపిడో టూవీల్లర్ల విషయంలో అధికారులను సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు చెప్పారు.