
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల బిల్లు గత నెల 17న రాజ్ భవన్ కు చేరింది. ఒకే రోజు ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. ఇటీవలే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. అయితే బీసీ రిజర్వేషన్ల బిల్లు మాత్రం రాజ్ భవన్ లోనే పెండింగ్ లో ఉండిపోయింది.
దీనిపై ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తమిళనాడు లో పది బిల్లులను అక్కడి గవర్నర్ రవి తన వద్దే ఉంచుకున్నారని, తిప్పి పంపడమో.. రాష్ట్రపతి సమీక్షకు పంపడమో చేయలేదని పేర్కొంటూ అక్కడి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో సర్వోన్నత న్యాయస్థానం సీరియస్ అయ్యింది. నెల రోజుల లోపు ఏదో ఒకటి చేయాలని సూచించింది. తిప్పి పంపడమో చేయాలి.
ఒక వేళ రాష్ట్ర పతి సమీక్షకు పంపాలని భావిస్తే నెల రోజుల్లోపే ఆ పనిచేయాలని సూచించింది. దీనిపై అనుమానాలు ఏమైనా ఉంటే సంబంధిత అధికారులు, సీఎస్ ను పిలిచి మాట్లాడే అవకాశం ఉంటుంది. న్యాయ సమ్మతం కాదని గవర్నర్ భావిస్తే దానిని అసెంబ్లీకి మళ్లీ తిప్పి పంపాలి.. అసెంబ్లీ మల్లీ ఆమోదించి పంపితే దాన్ని గరిష్ఠంగా నెలలోపు ఆమోదించాలి. అసెంబ్లీ నుంచి రాజ్ భవన్ కు బీసీ రిజర్వేషన్ల బిల్లు వెళ్లి 24 రోజులవుతోంది. ఈ నెల 17తో సుప్రీంకోర్టు తాజాగా సూచించిన నెల రోజుల గడువు ముగుస్తుంది. ఈ లెక్కన ఇంకా ఆరు రోజులే మిగిలి ఉంది. బీసీ రిజర్వేషన్ల బిల్లుపై న్యాయ సమీక్ష జరుగుతోందని రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
రాష్ట్రపతికి పంపితే..
బీసీ బిల్లును గవర్నర్ కార్యాలయం రాష్ట్రపతి సమీక్షకు పంపే అవకాశం ఉందనే ప్రచారం ముమ్మరంగ సాగుతోంది. అయితే గవర్నర్ నిర్ణయం ప్రస్తుతం కీలకంగా మారింది. ఈ బిల్లును ఆయన రాష్ట్రపతికి పంపితే అక్కడ తెలంగాణకు సంబంధించిన మూడో బిల్లు పెండింగ్ లో ఉండే ప్రమాదం ఉంది. తమిళిసై సౌందరరాజన్ గవర్నర్‌గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ది యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు, 2022, ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు–2022 పంపగా పెండింగ్ లో పెట్టారు. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లుపై ఎటువంటి స్పందన లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం యూజీసీ మార్గదర్శకాలను అనుసరించి విశ్వవిద్యాలయాలలో నియామకాలను కొనసాగించింది. బీసీ బిల్లు కూడా పంపితే మూడోది అవుతుంది.
రాజ్ భవన్ లో న్యాయ సమీక్ష
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేశారు. స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లను 29% నుంచి 42%కి పెంచుతూ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం గవర్నర్ కు పంపింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు 50% దాటొద్దు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తే ఆ పరిమితి దాటుతుంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే అంశంపై రాజ్ భవన్ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ బిల్లును కోర్టులో సవాలు చేయలేని విధంగా రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోంది.