విశ్లేషణ:బీసీల భవితను నిర్ణయించేలా ఉద్యమం చేయాలె

‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనుకున్నప్పుడు ఆ దేశంలో మెజార్టీ ప్రజలైన ఓబీసీలను ఎందుకు లెక్క చేయడం లేదు? సకల సామాజిక రంగాల్లో మేమెంత మందిమో మాకంత వాటా కావాలంటూ బీసీలు కదం తొక్కుతున్నారు. అందుకే అంబేద్కర్​ ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని ఎక్కుబెట్టి బీసీ కులాల వారీగా జనాభా లెక్కలను సాధించాలి. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే పార్టీలకే బీసీల ఓట్లు అనే నినాదంతో దేశవ్యాప్త ఉద్యమం చేపట్టాలి. ఎన్నో పోరాటాలు, ఎన్నో త్యాగాలు చేసి, మానవాళి మనుగడకు చెమటోడ్చిన బీసీలు అధికారానికి, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండిపోయారు. ఎన్నో ఏండ్లుగా తమ జనాభా ఎంతో లెక్కలు లేక ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవిస్తున్నారు. అందుకే దేశంలో ఈసారి తీసే జనాభా లెక్కల నుంచే బీసీల ఆత్మగౌరవ, రాజ్యాధికార ఉద్యమం మొదలుకావాలి. అందుకోసం పార్టీలు, సంఘాలు, రాష్ట్రాలు, ప్రాంతాలకు అతీతంగా బీసీలు ఉద్యమంలోకి రావాలి.

మనదేశంలో పులులు, కుక్కలు, నక్కలు, కోతులు, చెట్టుపుట్టలను లెక్కిస్తున్నారు. ఆ లెక్కలను వెల్లడిస్తున్న సమయంలో బీసీ కులాల వారీగా లెక్కలు తీయడం మాత్రం ఎందుకు కష్టమవుతోంది? ఒక మనిషిని, ఒక సమూహాన్ని లెక్కలోకి తీసుకోకపోవడం కంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో న్యాయం కోసం బీసీలు చేస్తున్న పోరాటాన్ని ఆధిపత్య కులాలు అణచివేస్తూనే ఉన్నాయి. దేశ జనాభాలో 60 శాతం పైగా ఉన్న ఓబీసీలను పాలక కులాలు ఓటర్లుగా, శ్రామికులుగా, బానిసలుగానే చూస్తున్నారు తప్ప, రాజ్యాధికారం పొందాల్సిన వర్గాలుగా పరిగణించడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితంగా మండల్ కమిషన్ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యా, ఉద్యోగ రంగాల్లో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం వచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసులు వేసి ఓబీసీల జనాభా తెలియకుండా రిజర్వేషన్లు ఎలా నిర్ణయిస్తారని కొందరు వాదించారు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీల జనాభా 27 శాతం ఉందని కోర్టుకు నివేదించింది. అయితే వాస్తవాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. జాతీయ శాంపిల్ సర్వే ప్రకారం ఓబీసీలు 57 శాతానికి పైగా ఉన్నారని స్పష్టం చేసింది. అయినా వారికి దక్కాల్సిన వాస్తవమైన హక్కులు ఇప్పటికీ కూడా దక్కడం లేదు.

అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం దక్కాలనే..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం ఓబీసీలను గుర్తించడానికి కమిషన్ ఏర్పాటు చేసి వారి జనాభా లెక్కలు తీసి అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం కల్పించాలి. ఈ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటైన మండల్ కమిషన్ 52 శాతంగా ఉన్న ఓబీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఎస్సీ, ఎస్టీ లకు కల్పించిన రిజర్వేషన్లు ఓబీసీలకు కూడా వారి జనాభా ప్రకారం కల్పించాలని సిఫారసు చేసింది. జనాభా లెక్కల ప్రకారం రాజకీయ రంగంలో ప్రాతినిధ్యం కల్పించాలని ఓబీసీలు చేస్తున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సూచన చేసిన సుప్రీంకోర్టు వైఖరి వల్ల ఓబీసీలకు 52 శాతం దక్కాల్సిన రిజర్వేషన్లు 27 శాతమే దక్కాయి. ఆనాటి నుంచి నేటి వరకు న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండూ ఓబీసీలకు వ్యతిరేకంగా ఉండి వారికి తీరని అన్యాయం చేస్తున్నాయి. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సేకరిస్తున్న జనాభా లెక్కల్లో ఓబీసీల సంఖ్య ఎంతో తేల్చాలని దేశవ్యాప్తంగా ఓబీసీలు చేస్తున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పాలక పార్టీలు పెడచెవిన పెడుతున్నాయి. దీంతో వీరంతా పోరు బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

బ్రిటిష్​ కాలం నుంచే..
ఓబీసీల జనాభా లెక్కలను కేంద్రం, సుప్రీంకోర్టు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? దేశంలో ఎస్సీ, ఎస్టీల కన్నా ఓబీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు. రాజకీయ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీలకు బ్రిటిష్ పాలన కాలం నుంచే ఉన్నాయి. ఓబీసీలకు వయోజన ఓటు హక్కు, రెండు ఓట్లు, ప్రత్యేక నియోజకవర్గాలు, తగినంత ప్రాతినిధ్యం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనకు బ్రిటిష్ వాళ్లు సానుకూలంగా స్పందించారు. ఇండియాలో మొదటగా 1871లో జనాభా లెక్కలు తీసి ఆయా వర్గాల ప్రజల వెనుకబాటుతనాన్ని పరిశీలించి వారి అభివృద్ధికి బాటలు వేశారు బ్రిటిష్​ పాలకులు. చివరగా 1931లో జనాభా లెక్కలు తీసిన బ్రిటిష్ పాలకులు కులాల వారీగా కూడా లెక్కలు తీశారు. బీసీలపై పరాయి దేశ పాలకులకు ఉన్న శ్రద్ధ మన దేశ పాలకులకు లేకపోవడం బాధాకరం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 యేండ్లు గడిచినా, ఇప్పటికీ కొన్ని కులాల పాలనే కొనసాగుతోంది. వీరి పాలనలో ఓబీసీలకు జరుగుతున్నది ద్రోహమే. పలు రాష్ట్రాల పాలకులు అసెంబ్లీల్లో తీర్మానాలు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ నిజంగా వీరిలో బీసీల లెక్కలు తీయాలనే సంకల్పం కనిపించడం లేదు.

రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాదు రిప్రజంటేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు
రిజర్వేషన్ అనేది రిప్రజంటేషన్​కు ప్రత్యామ్నాయంగా వాడుతుండడం వల్ల ఆర్థిక ప్రాతిపదికన పేదలకు రిజర్వేషన్లు పెట్టాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. నిజానికి రిజర్వేషన్ కాదు రిప్రజంటేషన్ (ప్రాతినిధ్యం) అనేది వాడాలి. నిచ్చెన మెట్ల కుల సమాజం నుంచి గణతంత్ర ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికే అంబేద్కర్ చట్టసభల్లో, సమస్త రంగాల్లో అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉండాలని రిజర్వేషన్లు పెట్టారు. ఆయన ఆలోచనలకు నిరంతరం తూట్లు పొడుస్తున్నాయి ఆధిపత్య కులాలు. రిజర్వేషన్ కు బదులుగా రిప్రజంటేషన్ అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సంపదను జాతీయం చేయడం ద్వారా సంపద ప్రజలకు చెందుతుందని అంబేద్కర్ ఆశించారు. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాలనలో ఇందిరాగాంధీ ప్రైవేటు సంస్థలను జాతీయం చేసింది. ప్రభుత్వ రంగ సంస్థలంటే కేవలం ప్రభుత్వం, ఉద్యోగులవి మాత్రమే కాదు. అది ప్రజల సంపద, భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తరాల భవితవ్యానికి ఉపయోగపడేవని అర్థం చేసుకోవాలి. 

బీసీల జనాభా లెక్కలు తీయాల్సిందే
దేశంలో మానవ అభివృద్ధికి, నాగరిక సమాజానికి కావాల్సిన పనిముట్లు, వివిధ వృత్తులకు అవసరమైన సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కనుగొన్న వారిని వెనుకబడిన తరగతులుగా పేర్కొంటూ అవమానపరుస్తున్నారు. నేటికీ దేశంలో కనపడని, లెక్కకు దొరకని అడవుల్లోని పులుల గణన చేపడుతూ బహిర్గతం చేస్తున్నారు. కానీ బీసీల లెక్క ఎంతో తేల్చడం లేదంటే పాలకులు బీసీలను జంతువులకన్నా హీనంగా చూస్తున్నారని అర్థమవుతోంది. మేమెంత మందిమో మాకంత వాటా కావాలని సామాజిక న్యాయ పోరాటం ఉధృతమవుతున్న ప్రస్తుత తరుణంలో బీసీ కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ అత్యంత అవసరమైంది. ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్న బీసీలకు ప్రస్తుతం దిక్కు లేకుండాపోవడంతో వారంతా ఇప్పుడు ఎక్కువగా వలసలు పోతున్నారు. దోపిడీ, మోసాలు తెలియని వీరు ముంబై, దుబాయిలకు వలసలు వెళ్లి దోపిడీ, మోసాలకు గురవుతున్నారు. ఇజ్జత్ కోసం అవస్థలు పడుతూ పస్తులుంటూ, అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటన్నిటికి ప్రధాన కారణం బీసీలకు నిర్ణయాధికారం లేకపోవడమే. నిర్ణయాధికారం రావాలంటే రాజకీయ రిజర్వేషన్లు కావాలి. రాజకీయ రిజర్వేషన్లు కావాలంటే బీసీల జనాభా లెక్కలు తీసి తీరాలి. అందుకోసం బీసీల భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను, బతుకును నిర్ణయించేలా ఉద్యమం చేపట్టాలి. ఇందు కోసం అన్ని వర్గాల ప్రజలతో కలిపి ఐక్య కార్యాచరణ కమిటీ వేసుకొని దేశ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ఎన్నో పోరాటాలకు కేంద్ర బిందువైన తెలంగాణ ఉద్యమ శక్తులు దేశ వ్యాప్త బీసీ జనాభా లెక్కల ఉద్యమానికి కూడా నాయకత్వం వహించాలి.

-సాయిని నరేందర్, సోషల్​ ఎనలిస్ట్