బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలి

బీసీ రిజర్వేషన్లు 52 శాతానికి పెంచాలి
  • బీసీ కమిషన్ సభ్యుల ఎదుట అభిప్రాయం వ్యక్తం చేసిన బీసీ కులాలు
  • జనాభా దామాషా ప్రకారం పెంచాలని డిమాండ్
  • స్థానిక సంస్థల్లో, ఉద్యోగాల్లో అన్యాయం జరుగుతున్నదని ఆవేదన
  • ఆదిలాబాద్​లో బీసీ కమిషన్ ​ఆధ్వర్యంలో అభిప్రాయ సేకరణ

ఆదిలాబాద్, వెలుగు: రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని, అప్పుడే తమకు న్యాయం జరుగుతుందని బీసీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.  బీసీలోని చాలా వర్గాలు అత్యంత వెనుకబడి ఉన్నాయని, వాటికి గుర్తింపు ఇవ్వడంతోపాటు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తెలంగాణలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీ సంక్షేమ శాఖ కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా ఆదిలాబాద్​ జిల్లాలో సోమవారం ‘బహిరంగ విచారణ’ పేరుతో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. 

 జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు బాల లక్ష్మి రంగు, తిరుమలగిరి సురేందర్, రాపోలు జయప్రకాశ్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్​ బాల మాయాదేవి, కలెక్టర్లు రాజర్షి షా, కుమార్ దీపక్, అభిలాష అభినవ్, ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ముందుగా బీసీ కులాల్లోని పలు వర్గాల ప్రతినిధులు, ప్రజలు రిజర్వేషన్ల పెంపు, సమగ్ర కులగణన, వారివారి ఆర్థిక పరిస్థితులపై సభ్యులకు కొన్ని వివరాలు తెలియజేశారు. 

రిజర్వేషన్​ ఫలాలు అందడం లేదు 

రాష్ట్రంలో  56 శాతం బీసీ జనాభా ఉన్నప్పటికీ సరైన రిజర్వేషన్​ ఫలాలు అందడం లేదని, రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉన్నదని బీసీ కులాల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రభుత్వం బీసీ కమిషన్ ద్వారా సమగ్ర కుల గణన చేపట్టి, 52 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీలోని ఓడ్ కులస్తులకు అసలు కులంగా గుర్తింపు దక్కడం లేదని, వీరిని ఎంబీసీలో చేర్చాలని అన్నారు. కుమ్మరి కులస్తులకు జీవనాధారంగా ఉండే మట్టి దొరకడం లేదని, అడవికి వెళ్లి కట్టె తెచ్చుకునే పరిస్థితి లేదని ఆ వర్గానికి చెందిన ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. 

గౌడ కులస్తులకు ఐదెకరాల భూమి ఇవ్వాలని, ఏజెన్సీ గ్రామాల్లో గీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలని ఆ వర్గం నేతలు కోరారు.  బీసీ కులాల్లోని అత్యంత వెనుకబడిన వర్గాలన్నీ తమకు సరైన గుర్తింపు రావడం లేదని తెలిపాయి. రిజర్వేషన్లు లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని, ఆర్థికంగా వెనుకబాటుకు గురవుతున్నామని పేర్కొన్నారు.  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొత్త జిల్లాలవారీగా అభిప్రాయాలను తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుంచి 63 మంది, ఆసిఫాబాద్ నుంచి ఆరుగురు, మంచిర్యాల నుంచి ఏడుగురు, నిర్మల్ నుంచి 14 మంది దరఖాస్తు రూపంలో వారి అభిప్రాయాలను కమిషన్ కు అందజేశారు. 

అందరికీ ఆమోదయోగ్యంగానే రిజర్వేషన్లు: నిరంజన్​ 

కుల గణనపై అందిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకొని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు రిజర్వేషన్లు ఖరారు చేస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ గోపిశెట్టి నిరంజన్ వెల్లడించారు. జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక అభివృద్ధి, సాధికారత సాధించే దిశగా రిజర్వేషన్ల అమలు కోసం సమగ్ర సర్వే చేపట్టనున్నట్టు తెలిపారు. 

సోమవారం ఆదిలాబాద్ జడ్పీ మీటింగ్ హాల్​లో నిరంజన్​విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పారు.  ఆయా కుల సంఘాల ప్రతినిధులు అందించిన విజ్ఞప్తులపై విచారణ జరిపి, నిర్ణయం తీసుకుంటామన్నారు.  రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఈ నెల 13వ తేదీవరకు పర్యటిస్తామని, ఈ లోగా అభ్యంతరాలు ఉంటే హైదరాబాద్​లోని కార్యాలయంలోనూ అందజేసేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. నవంబర్ 4వ తేదీ నుంచి గ్రామాలు, పట్టణాల్లో ప్రతి కుటుంబానికి సంబంధించి సామాజిక, ఆర్థిక సర్వే జరుగుతుందని వెల్లడించారు. ఇందులో అన్ని కుల సంఘాల ప్రతినిధులు బాధ్యతలు తీసుకొని, వివరాలు నమోదు చేయించేలా చూడాలని సూచించారు. డిసెంబర్ 9లోగా సర్వే వివరాలను హైకోర్టుకు నివేదిస్తామని వివరించారు.