దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి : నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలి : నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ 

  • రాష్ట్రంలో కుల గణన చివరి దశలో ఉంది: ఎంపీ మల్లు రవి
  • ఢిల్లీలోని జంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద ధర్నా

న్యూఢిల్లీ, వెలుగు: దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నరేందర్ గౌడ్ నేతృత్వంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ఇతర పార్టీల నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని, మద్దతు తెలిపారు. నరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. 1931 నాటి నుంచి బీసీ రిజర్వేషన్లు తగ్గించుకుంటూ వస్తూ.. ఈడబ్ల్యూసీ పేరిట అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పించడం కేంద్ర ప్రభుత్వ దిక్కుమాలిన ఆలోచన అని ఫైర్ అయ్యారు.

కేంద్ర ప్రభుత్వానికి హిందూ నినాదం తప్ప ప్రజల ప్రగతి కోసం చేసిందేమీ లేదన్నారు. అమెరికా లాంటి దేశాల్లో బెగ్గింగ్ చేస్తే జైలు శిక్ష విధిస్తారని, కానీ ఇండియాలో 300 కులాల జీవన వృత్తి అడుక్కోవడమని రికార్డుల్లో నమోదు చేయడం సిగ్గు చేటన్నారు. కుల గణన కోసం కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి కుల గణన సర్వే చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. నిజంగా బీజేపీకి బీసీలపై ప్రేముంటే ఆర్ఎస్ఎస్ చీఫ్‌‌‌‌‌‌‌‌గా బీసీ నేత ఆలె శ్యామ్‌‌‌‌‌‌‌‌జీని నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 

తెలంగాణలో చివరి దశలో కుల గణన: మల్లు రవి

తెలంగాణ రాష్ట్రంలో కులగణన చివరి దశలో ఉందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. కుల గణనకు దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో రేవంత్ సర్కార్ అనుకూలంగా ఉందని గుర్తుచేశారు. సోనియా, రాహుల్ గాంధీలు కులగణన విషయంలో స్పష్టంగా ఉన్నారని చెప్పారు. ఈ సర్వే పూర్తి కాగానే కుల గణన ఆధారంగా బీసీల అభ్యున్నతి, అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. రాజ్యాంగ పదవుల కోసం శాసనకర్తలు కావాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ రాపోలు అభిప్రాయపడ్డారు.