భూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..

భూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..

పాలకులు ఏ చట్టం చేసినా, ఎలాంటి  సంస్కరణలు తీసుకొచ్చినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. అలా వచ్చినవాటికి ప్రజామద్దతు లభించడంతో పాటు అవి పదికాలాలపాటు ఉంటాయి.  కానీ, తెలంగాణ రాష్ట్రంలో మహాద్భుత చట్టంగా ధరణి రూపంలో  రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్వోఆర్) 2020 వచ్చింది. ధరణి వచ్చాక రాష్ట్రంలో ఒక అలజడి మొదలైంది. ఒక విధంగా చెప్పాలంటే  తెలంగాణ  సమాజాన్ని కుదిపేసింది. ముఖ్యంగా భూమినే నమ్ముకుని జీవిస్తున్న  రైతుకు మాత్రం కంటిమీద కునుకు లేకుండా చేసింది.

చేతిలో సెంటు భూమి లేని, అసలు వ్యవసాయం  తెలియనివాళ్లకు హక్కుల రికార్డులు ఇంటికొచ్చాయి.  సాగుచేస్తున్న  రైతు, చేతిలో పట్టాలున్నవారు ఒకే భూమికోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చట్టంగా ధరణి వచ్చి తెలంగాణ ప్రజలకు శాపంగా మారింది. ఈనేపథ్యంలో  రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన  కాంగ్రెస్​ ప్రభుత్వం నూతన ఆర్వోఆర్ చట్టం-2025 భూభారతి రూపంలో తేవడం జరిగింది.

గ్రామ స్థాయిలోనూ రెవెన్యూ వ్యవస్థను బలోపేతంచేసి, రైతులకు,  ప్రజలకు రెవెన్యూ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా 10,954 మంది  గ్రామపాలన అధికారులను నియమించనుంది. రాష్ట్రంలో భూసమస్యలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో రేవంత్​రెడ్డి సర్కార్​నూతన భూచట్టంగా ఆర్వోఆర్ 2025ను తెచ్చింది.  భూమి హక్కుల రికార్డు- 2025 భూభారతి  అందుబాటులోకి వచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే  రాష్ట్రంలోనే కాకుండా  దేశంలోని 18 రాష్ట్రాలలో అమలు జరుగుతున్న ఆర్వోఆర్ చట్టాలను సైతం అధ్యయనంచేసి  భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా,  రైతుకు మేలుచేసే చట్టంగా భూభారతిని రూపొందించింది. దాన్ని భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్​ జయంతి రోజున అమల్లోకి తెచ్చారు.  భూభారతి చట్టం-2025 నాలుగు మండలాలను  పైలెట్ ప్రాజెక్టుగా  ఎంపిక చేసి అమలు చేస్తున్నారు.

శాశ్వత పరిష్కారం
తెలంగాణలో అత్యధికంగా  భూ లావాదేవీలు సాదా బైనామా పద్ధతిలోనే జరిగేది. అంటే ప్రస్తుతం జరుగుతున్న దస్తావేజులు, రిజిస్ట్రేషన్ వంటి వాటికి దూరంగానే ఉండేవారు. ఈ సమస్యను  పరిష్కరించేందుకు గత ప్రభుత్వం సాదా బైనామాలను క్రమబద్ధీకరిస్తామనడంతో సుమారు 10 లక్షల దరఖాస్తులొచ్చాయి.  కానీ, ధరణి చట్టంలో సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఎలాంటి అవకాశం లేకుండాపోయింది. ఇదే కాకుండా 2017లో చేసిన భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో వివిధ రకాల భూ సమస్యలున్న సుమారు 18 లక్షల ఎకరాల భూమిని ‘పార్టు–-బీ’లో  చేర్చి వదిలేశారు. అవి కూడా ధరణికి దూరమయ్యాయి.

ఇవే కాకుండా అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ, ఇనాం భూములకు ఓఆర్సీ పొందిన, వారసత్వంగా వచ్చిన భూములకు సైతం ధరణిలో చేర్చే అవకాశం లేదు. భూభారతిలో ఇలాంటి అన్ని రకాల సమస్యలకు పరిష్కారం లభించనుంది.  జూన్ 2,  2014 కంటే ముందు  సాదాబైనామా పద్ధతిలో కొనుగోలు చేసి 12 ఏళ్లుగా అనుభవంలో ఉంటూ 2020లో సాదాబైనామా  క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నవారికి ఆర్డీఓ స్థాయిలో విచారణ చేసి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనున్నారు.  వారసత్వంగా లేదా వీలునామా ద్వారా వచ్చిన భూములను తహసీల్దార్ స్థాయిలోనే విచారణ చేసి హక్కుల రికార్డులో మ్యుటేషన్  చేయనున్నారు. ఇదే తరహాలో హక్కుల రికార్డులో తప్పుల సవరణకు కూడా ఆర్డీఓ, జిల్లా కలెక్టర్లకు  అధికారం ఇవ్వడం జరిగింది. 

రెండంచెల అప్పీల్ వ్యవస్థ
భూభారతిలో  రెండంచెల అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి  రానుంది.  తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లు,  జారీచేసిన పాసుపుస్తకాలు, భూదార్​పై అభ్యంతరాలు ఉంటే ఆర్డీవోకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఆర్డీవో ఇచ్చిన తీర్పుపై  అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్​కి  రెండో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించనున్నారు. ఆర్డీవో చేసిన  మ్యుటేషన్లు,  సాదాబైనామాల  క్రమబద్ధీకరణపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు, జిల్లా కలెక్టర్ తీర్పుపై అభ్యంతరాలు ఉంటే భూమి ట్రిబ్యునల్​కి రెండో అప్పీల్కు కూడా పోయేవిధంగా భూభారతిలో అవకాశం ఉంది. 

హక్కుల రికార్డులను ఎవరైనా మోసపూరితంగా మార్పుచేసి  గైరానీ, భూదాన్, లావోనీ, అసైన్డ్, దేవాదాయ  భూములకు పట్టాలు పొందితే వాటిని రద్దు చేయమని డిమాండ్ చేసే అధికారం కూడా భూభారతిలో కల్పించడం జరిగింది. నేరుగా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇలాంటి సందర్భంలో  సీసీఎస్ఏ  తనంత తానుగా కూడా చర్యలు తీసుకునే అధికారం ఉంది. హక్కుల రికార్డుల్లో తప్పుల సవరణకు, భూమి హక్కులు ఉండి రికార్డుల్లో  లేనివారు హక్కుల రికార్డులో నమోదు చేయించుకోవడానికి  ఏడాదిపాటు అవకాశం ఇచ్చారు.  భూభారతిలో అప్పీల్ వ్యవస్థ రావడంతో  కోర్టుల దాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. 

అక్రమ అధికారులపై చర్యలు
భూభారతి చట్టంలో అధికారులకు అధికారాలతోపాటు తప్పులు చేస్తే శిక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది.  ప్రభుత్వ భూములకు పాసు పుస్తకాలు జారీ చేస్తే విచారించి పాసుపుస్తకం రద్దుచేసే అధికారం సీసీఎల్ఎకు ఇవ్వడం జరిగింది.  ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు తహసీల్దార్,  సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలతోపాటు  క్రిమినల్  కేసులను కూడా బనాయించే అవకాశం ఉంటుంది.

ఇదే కాకుండా రికార్డులను టాంపర్ చేసినా,  నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులు జారీ చేసిన అధికారులపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకోనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భూ సమస్యలకు సంబంధించి పేదలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా రైతులకు  న్యాయ సేవా సంస్థలు, ఇతర సంస్థల ద్వారా ఉచిత న్యాయ సాయం కూడా అందించనున్నారు. ఇదే విధంగా రెవెన్యూ ట్రిబ్యునల్స్ను కూడా మూడంచెలలో ఏర్పాటు చేస్తే భూభారతి లక్ష్యం నూరుశాతం నెరవేరనుంది.  

డా.ఎన్.యాదగిరిరావు, అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ