
- రెవెన్యూ, ఆర్డీఓ ఆఫీసుల్లోనూ ఏర్పాటు చేస్తం
- ‘భూభారతి’పై అవగాహన సదస్సుల్లో మంత్రి పొంగులేటి
ఇబ్రహీంపట్నం, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా భూముల సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ, ఆర్డీవో ఆఫీసులతోపాటు కలెక్టరేట్లలో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. గతంలో ధరణి పార్టు బీలో పెట్టిన 18 లక్షల ఎకరాల సమస్యను భూ భారతి ద్వారా పరిష్కరిస్తామన్నారు. గతంలో అప్పీలు వ్యవస్థ లేక పుస్తెలు తాకట్టు పెట్టి రైతులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చేదన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ‘భూ భారతి’ అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధరణితో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు. వాటన్నింటినీ పరిష్కరించేందుకే భూ భారతి తీసుకొచ్చినట్టు చెప్పారు. సమస్యలు పరిష్కరించడానికి రెవెన్యూ అధికారులే రైతులు వద్దకు వస్తారన్నారు. అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదన్నారు. సర్వే మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేల మంది లైసెన్సుడ్ సర్వేయర్లను తీసుకుని భూములు సర్వే చేయిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ భూమిలో సాగులో ఉండి అర్హతలు కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయిస్తామని చెప్పారు.
గతంలో కొందరు భూమి లేకున్నా రైతుబంధు కోసం పాసు పుస్తకాలు తీసుకున్నారని, అటువంటి వాటికి ఇకపై అవకాశం ఉండదన్నారు. ప్రతి ఏటా డిసెంబర్ 31న డేటాను తీసి భద్రపరుస్తామని చెప్పారు. ఈ చట్టం అద్భుతంగా ఉందని, అమలు బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. పార్టీలకు అతీతంగా ఇందిరమ్మ రాజ్యం పనిచేస్తుందని, పింక్ కలర్ దుస్తులు వేసుకున్న వారికీ న్యాయం జరుగుతుందన్నారు. ధరణిని అడ్డం పెట్టుకొని కబ్జాచేసిన ప్రభుత్వ భూములను తిరిగి తీసుకుంటామన్నారు. రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి మాట్లాడుతూ.. రైతుల ఇబ్బందులను తొలగించేందుకే భూ భారతి చట్టం తెచ్చినట్టు చెప్పారు. ఈ చట్టంతో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా ప్రజలకు న్యాయం జరగాలనే ఈ చట్టం తీసుకొచ్చినట్టు చెప్పారు. ఈ చట్టంలో ఇంకా ఏమైనా ఇబ్బందులుంటే ప్రభుత్వం దృష్టికి తేవాలన్నారు. కాగా, నల్గొండ జిల్లా చందంపేట మండలం తహసీల్దార్ ఆవరణతో పాటు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం అత్వెల్లి గ్రామంలోని జీఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన భూ భారతి అవగాహన సదస్సుల్లోనూ పొంగులేటి పాల్గొన్నారు.