
- ఎంసీహెచ్ఆర్డీలో నేటి నుంచి రెండు రోజులు వర్క్ షాప్
- మాడ్యూల్స్తగ్గింపు.. సర్వే మ్యాప్రూపకల్పనపై సమాలోచనలు
- కిందిస్థాయిలోనే అప్లికేషన్లు పరిష్కరించేలా రూల్స్
- ట్రిబ్యునల్స్లో ఎవరుండాలనేది తేల్చనున్న అధికారులు
- అప్పీళ్ల వ్యవస్థ, సాదా బైనామాల పరిష్కారం, పార్ట్‌బీ భూములపై క్లారిటీ
హైదరాబాద్, వెలుగు: భూ భారతి చట్టానికి రూల్స్ఖరారు చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమైంది. చట్టం వచ్చి దాదాపు 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో వీటిని తీసుకువచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో రెండు రోజులపాటు వర్క్‌షాప్ నిర్వహించనున్నది. ఈ మంగళ, బుధ వారాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు ఎలాంటి రూల్స్ను తీసుకురావాలనే దానిపై ఉన్నతాధికారుల దగ్గర నుంచి.. కింది స్థాయిలో తహసీల్దార్ల దాకా ఎంపిక చేసిన వారితో సమావేశం నిర్వహించబోతున్నది.
ఇప్పటికే ప్రభుత్వం అనుకున్న కొన్ని రూల్స్, గతంలో అమలైనవి, చట్టంలో పేర్కొన్న అంశాలకు తగ్గట్టుగా కొత్తవి ప్రతిపాదించనున్నది. వాటి అమలులో ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఏ రకంగా ఉంటే సమస్యలు రాకుండా ఉంటాయి? అనే కోణంలో 2 రోజులు వర్క్‌షాప్‌ను నిర్వహిస్తున్నారు.
ఇందులో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్సెక్రటరీ నవీన్ మిట్టల్ తోపాటు నాలుగైదు జిల్లాల కలెక్టర్లు, ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో పాటు భూ చట్టాల నిపుణులు భూమి సునీల్, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ లచ్చిరెడ్డి తదిరులు పాల్గొంటారని తెలుస్తున్నది. ప్రధానంగా మాడ్యూల్స్‌ను ఎలా తగ్గించాలి? కొత్త చట్టంలో పేర్కొన్న సర్వే మ్యాప్‌ను ఎలా సిద్ధం చేసుకోవాలి ? అనేదానిపై కసరత్తు చేయనున్నారు. రైతులకు ఈజీగా ఉండి.. కింది స్థాయిలోనే అప్లికేషన్లు పరిష్కరించే దిశగా రూల్స్ను రెడీ చేయనున్నారు.
భూ భారతి చట్టంలో ప్రధానంగా అప్పీళ్ల వ్యవస్థ, ట్రిబ్యునళ్లు తెచ్చారు. దీంతో ట్రిబ్యునల్స్లో ఎవరు ఉండాలి ? ఏ సమస్యకు ఎన్ని రోజుల్లో పరిష్కారం చూపించాలి? అనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అప్పీళ్ల వ్యవస్థలోనూ ఎంత సమయం పెట్టాలనే దానిపై రూల్స్లో క్లారిటీ ఇవ్వనున్నారు. వీటితోపాటు సాదా బైనామాల పరిష్కారం, పార్ట్ బీ భూముల విషయంలో తీసుకోవాల్సిన దానిపై రూల్స్లో స్పష్టత ఇవ్వనున్నారు.