గ్రామస్థాయిలో ఐదు రకాల భూ రికార్డులు

గ్రామస్థాయిలో ఐదు రకాల భూ రికార్డులు
  • భూభారతి రూల్స్​ రిలీజ్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ రికార్డులు, యాజమాన్య హక్కులు, లావాదేవీల సమస్యలను సులభతరం చేసేందుకు ప్రభుత్వం భూ భారతి రూల్స్ –2025ను సోమవారం విడుదల చేసింది. ఈ రూల్స్ ‘తెలంగాణ భూ భారతి యాక్ట్– 2025’ ఆధారంగా  ఇచ్చారు.  అన్ని గ్రామాల్లో వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ భూముల రికార్డులను రికార్డింగ్ అథారిటీ తయారు చేసి, భూ భారతి పోర్టల్​లో అందుబాటులో ఉంచుతుంది. భూమి సర్వే, సబ్-డివిజన్ మ్యాప్‌‌లను లైసెన్స్డ్​ సర్వేయర్‌‌లు తయారు చేస్తారు. ఇక రూల్స్​లో ప్రధానంగా  భూ రికార్డులు ఆన్‌‌లైన్‌‌లో అందుబాటులో ఉండటంతోపాటు  వివాదాలు, తప్పుల సవరణకు నిర్దిష్ట గడువులు విధించారు.

అన్ని ప్రక్రియలు భూ భారతి పోర్టల్​లోనే జరగనున్నాయి. ఎస్సీ, ఎస్టీ,  మహిళలు, దివ్యాంగులకు ఉచిత లీగల్ సాయం అందించనున్నారు.  భూ భారతి యాక్ట్ కింద అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే.. ఫస్ట్ అప్పీల్ , సెకండ్ అప్పీల్ చేసే అవకాశం ఉంది. అయితే అన్నింటినీ  ఒకేసారి కాకుండా దశలవారీగా రాష్ట్ర ప్రభుత్వం రూల్స్​ను అమలు చేయనుంది. కాగా, గ్రామ స్థాయిలో భూ రికార్డులను భూ భారతి పోర్టల్ ద్వారా ఎలక్ట్రానిక్‌‌గా అప్‌‌డేట్ చేస్తారు. 

ఇందుకోసం ఐదు రిజిస్టర్లను మెయింటెయిన్​ చేయనున్నారు.   గ్రామ స్థాయిలో విలేజ్ అకౌంట్స్ కూడా డిజిటల్‌‌గా నిర్వహిస్తారు. ఇందులో పహణీ, ప్రభుత్వ భూముల రిజిస్టర్, ట్రాన్స్‌‌ఫర్ రిజిస్టర్, ఇరిగేషన్ రిజిస్టర్ వంటివి ఉంటాయి. మ్యుటేషన్ జరిగినప్పుడల్లా ఈ రికార్డులను అప్‌‌డేట్ చేస్తారు. ప్రతి డిసెంబర్ 31న స్నాప్‌‌షాట్ తీస్తారు, దీనివల్ల రికార్డులు సురక్షితంగా ఉంటాయి. సర్టిఫైడ్ కాపీలు రూ.10కి అందుబాటులో ఉంటాయి. 

డిజిటల్ రికార్డులు: వ్యవసాయ, వ్యవసాయేతర, ఆబాదీ భూముల రికార్డులు భూ భారతి పోర్టల్​లో అందుబాటులో ఉంటాయి. సర్వే, మ్యాప్‌‌లను లైసెన్స్డ్ సర్వేయర్‌‌లు తయారు చేస్తారు.

తప్పుల సవరణ: రికార్డ్ ఆఫ్ రైట్స్‌‌లో తప్పులను సవరించడానికి ఒక సంవత్సరం గడువులో ఆన్‌‌లైన్ దరఖాస్తు చేయవచ్చు. 60 రోజుల్లో పరిష్కారం.

లావాదేవీలు సులభం: కొనుగోలు, గిఫ్ట్, తాకట్టు వంటివి పోర్టల్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. తహసీల్దార్ కొత్త పట్టాదార్ పాస్‌‌బుక్ జారీ చేస్తారు.

నమోదు కాని ఒప్పందాలు: 2014కి ముందటి నమోదు కాని లావాదేవీలను సన్నకారు రైతులు 90 రోజుల్లో రెగ్యులరైజ్ చేయవచ్చు.

విల్ అండ్​  వారసత్వం: మ్యుటేషన్ కోసం 30 రోజుల్లో ఆర్డర్, లేదా ఆటోమేటిక్ మ్యుటేషన్.

భూధార్ కార్డ్: వివాదాలు లేని భూములకు తాత్కాలిక/పర్మినెంట్ భూధార్ కార్డ్, యూనిక్ ఐడీతో ఇవ్వనున్నారు. 

ఫీజులు: మ్యుటేషన్ ఎకరానికి రూ.2,500, రికార్డ్ సవరణ/అప్పీల్​కు రూ.1,000. పాస్‌‌బుక్ రూ.300, సర్టిఫైడ్ కాపీ రూ.10

ఫస్ట్​ అప్పీల్​.. సెకండ్​ అప్పీల్స్​ ఇలా

భూ రికార్డుల సవరణ, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూధార్ కార్డ్, పట్టాదార్ పాస్‌‌బుక్, నమోదు కాని లావాదేవీలు వంటి విషయాల్లో అధికారుల నిర్ణయాలపై అసంతృప్తి ఉంటే అప్పీల్ చేయొచ్చు. తహసీల్దార్ ఆర్డర్‌‌పై రికార్డ్ సవరణ విషయంలో ఆర్డీఓకు 30 రోజుల్లో  అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ నిర్ణయంపై జిల్లా కలెక్టర్​ కు, కలెక్టర్ ఆర్డర్‌‌పై ల్యాండ్ ట్రిబ్యునల్ కు  30 రోజుల్లో అప్పీల్ చేయొచ్చు.

రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, భూధార్,  పాస్​ బుక్ వంటి విషయాల్లో తహసీల్దార్ నిర్ణయంపై ఆర్డీఓకు 60 రోజుల్లో, నమోదు కాని లావాదేవీలు లేదా ఇతర మ్యుటేషన్‌‌లపై ఆర్డీఓ నిర్ణయంపై కలెక్టర్​కు 60 రోజుల్లో అప్పీల్ చేయొచ్చు. సెకండ్ అప్పీల్‌‌లో ఆర్డీఓ ఆర్డర్‌‌పై జిల్లా కలెక్టర్​కు , కలెక్టర్ నిర్ణయంపై ల్యాండ్ ట్రిబ్యునల్​కు30 రోజుల గడువులో అప్పీల్ చేయొచ్చు. అన్ని అప్పీల్స్ భూ భారతి పోర్టల్ ద్వారా ఆన్‌‌లైన్‌‌లో రూ.1,000 ఫీజుతో సమర్పించాలి.