
కాసులకు కక్కుర్తి పడి విదేశీయులను కూడా భారతీయులుగా చాలా ఈజీగా మార్చే్స్తున్నారు. భారీ ఎత్తున లంచం పుచ్చుకుని స్థానికులుగా బర్త్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. పై అధికారుల కళ్లుగప్పి కంప్యూటర్ ఆపరేటర్లు గుట్టు చప్పుడుకాకుండా సర్టిఫికేట్లు జారీ చేసిన ఘటన నార్సింగి మున్సిపాల్టీ లో వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలో బర్త్ సర్టిఫికేట్ల దందా నడుస్తుందని వచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి మున్సిపాలిటీ కార్యాలయంలో సుధీర్ అనే వ్యక్తి ఆరేళ్లుగా ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. అంతకు ముందు జీహెచ్ఎంసీ కార్యాలయంలో పని చేశాడు. సుధీర్ కు అనుభవం దృష్ట్యా అధికారులు అతడికి జనన, మరణ ధ్రువీకరణ జారీ చేసే బాధ్యతలను అప్పగించారు. దీన్ని అనుకూలంగా మార్చుకున్న సుధీర్.. నకిలీ సర్టిఫికేట్లు జారీ చేస్తూ దందా గుట్టు చప్పుడు కాకుండా దందా నడిపిస్తున్నాడు.
ఈ క్రమంలో బంగ్లాదేశీయుడికి నార్సిం గిలో జన్మించిన వ్యక్తిగా జనన ధ్రువీకరణ పత్రం జారీ చేశాడు. దాదాపు రెండేళ్ల క్రితం ఈ పత్రం తీసుకున్న బంగ్లాదేశ్ యువకుడు.. ఇటీవల పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. పోలీసుల వెరిఫికేషన్లో ఇతడు స్థానికుడు కాడని తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు సుధీర్ తో పాటు సదరు బంగ్లాదేశ్ వ్యక్తినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలో ఇంకా ఎవరెవరు ఉన్నారనేదానిపై ఆరా తీస్తున్నారు.
మరింత లోతుగా విచారణ
మున్సిపల్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న సుధీర్ రెండు సంవత్సరాల క్రితం ఒకరికి అప్పటి కమిషనర్ సత్యబాబు డిజిటల్ సంతకంతో జనన ధ్రువీకరణ పత్రం జారీ చేసినట్టు తెలిసింది. అది నకిలీదని, దానిపై విచారణ చేస్తున్నా మని, అతన్ని అదుపులోకి తీసుకుంటున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు. బర్త్ సర్టిఫికేట్ కోసం ఒక్కో వ్యక్తి నుంచి కనీసం 5 లక్షల రూపాయలు వసూలు చేసేవాడని తేలింది. సుధీర్ ను విచారించి దీని వెనుక ఉన్న మిగతావారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.
►ALSO READ | హైదరాబాద్లో కరెంటు బిల్లు పేరుతో మోసం.. 78 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ.4 లక్షలు కొట్టేశారు..