బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

  •  టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య 
  • గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి
  • నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి
  • అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: వచ్చే మార్చి నెలలో రాష్ట్రంలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి క్యాండిడేట్లను శుక్రవారం ప్రకటించింది. కరీంనగర్– నిజామాబాద్– ఆదిలాబాద్– మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి సి.అంజిరెడ్డిని, అదే సెగ్మెంట్ లో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమురయ్య పేర్లను ఖరారు చేసింది.

నల్గొండ– ఖమ్మం–వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తంరెడ్డి పేరును ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఈ మూడు స్థానాల్లోని ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనున్నది. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.

కార్పొరేట్ విద్యాసంస్థల అధిపతికి

వరంగల్ జిల్లాకు చెందిన సరోత్తం రెడ్డి గతంలో పీఆర్టీయూ స్టేట్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం మరోసారి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మల్క కొమురయ్య ప్రస్తుతం హైదరాబాద్ లో పల్లవి విద్యాసంస్థలకు చైర్మన్ గా కొనసాగుతున్నారు. గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ తరఫున మల్కాజిగిరి సీటును ఆశించి భంగపడ్డారు. దీంతో టీచర్ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. మెదక్ జిల్లా రాంచంద్రాపురానికి చెందిన సి.అంజిరెడ్డి బీజేపీ నాయకుడిగా ఉన్నారు.

ఆయన భార్య సంగారెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాన్ని ఆశించారు. తాజాగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. కాగా, గతంలో ‘హైదరాబాద్’ టీచర్ స్థానానికి కార్పొరేట్ విద్యాసంస్థ అధిపతికి టికెట్ ఇవ్వగా.. తాజాగా కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ ను మరో కార్పొరేట్ విద్యాసంస్థ చైర్మన్ కు బీజేపీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాగా, కొమురయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఆర్ఎస్ఎస్ అనుబంధ టీచర్ సంఘం తపస్ కు చెందిన నేతలు కొందరు హైకమాండ్​కు ఫిర్యాదు చేసినా పార్టీ పట్టించుకోలేదు.