- రాష్ట్ర ప్రజలకు న్యూ ఇయర్ విషెస్ తెలిపిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, వెలుగు: గడిచిన 2024 సంవత్సరం తెలంగాణ బీజేపీకి మధురస్మృతులను మిగిల్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ సీట్లు గెలిచిందన్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మంగళవారం కిషన్ రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
‘‘ప్రధాని మోదీ, బీజేపీకి రాష్ట్ర ప్రజలు అందించిన మద్దతు వల్లే మోదీ3.0 ప్రభుత్వంలో తెలంగాణ మెరుగైన భాగస్వామ్యం పొందింది. రాష్ట్రంలో 77,43,947 ఓట్లను సొంతం చేసుకున్న బీజేపీ.. 36 శాతం ఓట్లతో రాష్ట్రంలో గణనీయ ప్రభావం చూపింది. బీజేపీని తెలంగాణ ప్రజలు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. బీజేపీకి మద్దతుగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు’’అని పేర్కొన్నారు. మోదీ సుపరిపాలన, అభివృద్ధి లక్ష్యాలకు తోడు రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటాలు, ఉద్యమాలు చేస్తూ, బాధితులకు భరోసానిస్తూ, ప్రజల ఆదరాభిమానాలను బీజేపీ సొంతం చేసుకుందన్నారు.
తమ పార్టీ పట్ల ప్రజలు చూపిస్తున్న ఈ అభిమానం 2025లోనూ కొనసాగాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. కొత్త సంవత్సరం 2025లో ప్రజలందరికీ మంచి జరగాలని, సుఖ సంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు. మోదీ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పేర్కొంటూ.. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.