విశ్లేషణ: తెలంగాణ రాజకీయాలను మలుపుతిప్పే సంగ్రామం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్​ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఐదు వారాలపాటు సాగిన ఈ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా ఉత్సాహంగా పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ఆయన అన్ని వర్గాల ప్రజలను కలిసి వారి కష్టాలు, సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షలు నెరవేరినాయా లేదా? ప్రభుత్వం చెబుతున్న పథకాల అమలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి? అనే విషయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికే ఆయన ఈ యాత్ర చేపట్టారు. ఏ వర్గం ప్రజలను కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపించాయి. ప్రజల పరిస్థితి చూసి సంజయ్ చలించిపోయారు. తమను ఆదుకునే వారే కనిపించడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేయగా వారికి ఆయన అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆగస్టు 28న చార్మినార్‌‌‌‌ భాగ్యలక్ష్మీ టెంపుల్​ నుంచి మొదలైన సంజయ్ పాదయాత్ర ఐదు ఉమ్మడి జిల్లాల మీదుగా సాగి ఇవాళ హుస్నాబాద్‌‌‌‌లో ముగియనుంది.

ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి పథకాల అమలు చేస్తున్నామని చెబుతున్నా.. వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో ఎక్కడా లబ్ధిదారులకు చేరడం లేదు. ఎండ, వానలు లెక్కచేయకుండా సాగిన పాదయాత్రలో ప్రజలు వారి ఇబ్బందులపై సంజయ్​ను కలిసి తమ కష్టాలు చెప్పుకున్నారు.

పథకాలు ఆదుకుంటలేవు

సీఎం కేసీఆర్ ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటున్న రైతుబంధు పథకం రైతులను ఆదుకోలేక పోతోంది. పంటలకు మద్దతు ధర రాక,  పకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టపోతే పరిహారం కూడా అందడం లేదు. రుణమాఫీ అమలు కాకపోవడం వంటి పలు సమస్యలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. 30, 40 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న పొలాలకు సైతం కొత్త పాస్‌‌‌‌ పుస్తకాలు అందడం లేదు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చి నిర్వాసితులైన వారికి పూర్తి స్థాయిలో పునరావాస ప్యాకేజీలు అందడం లేదు. కష్టాల్లో మగ్గుతున్న ప్రజలను పట్టించుకునేవారే కనబడటం లేదు. డబుల్​ బెడ్​రూం ఇండ్లు ఎక్కడా కనబడటం లేదు. రైతులు, రైతు కూలీలు, చేతి వృత్తికారులు, స్వయం ఉపాధిపై ఆధారపడిన ఇలా అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ఏడేండ్ల పాలనలో ఏ మాత్రం సంతృప్తిగా లేరని ఈ పాదయాత్ర ద్వారా స్పష్టమైంది.

గ్రామాల్లో నాణ్యమైన వైద్యం అందుతలేదు

గత ఏడేండ్లలో ఉద్యోగ నియామకాలు లేకపోవడం, ఉపాధి అవకాశాలు లేక యువత పూర్తి నైరాశ్యంలో ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన విద్యార్థులు నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ప్రభుత్వం కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ కనీసం గ్రామ ప్రజలకు అందుబాటులో నాణ్యమైన వైద్యసేవలను కూడా తీసుకురాలేకపోయారు. ఎక్కడికక్కడ ప్రభుత్వ బడులను మూసివేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

హుజూరాబాద్​ ఉప ఎన్నిక తర్వాత రెండో దశ

పలు సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వ చేతకాని తనాన్ని ప్రజలే సంజయ్ కు పలుచోట్ల విన్నవించారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ను ఇంటికి పంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పాదయాత్ర మొదటి దశ పూర్తయిన తర్వాత బీజేపీ రాష్ట్ర శాఖ హుజురాబాద్ ఉపఎన్నికపై దృష్టి సారిస్తుంది. ఈ ఎన్నికలో కేసీఆర్ వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టడం, ఎన్నికల కోసమే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారు. బీజేపీ ఇక్కడ పక్కాగా విజయం సాధిస్తుంది. ఈ సక్సెస్​ ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు తెలంగాణలో బీజేపీని బలపర్చింది. హుజూరాబాద్​ఉపఎన్నిక పూర్తయిన తర్వాత బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రెండో దశ ప్రారంభమవుతుంది.

ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపిన్రు

సంజయ్​ పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలను వారి నుంచే నేరుగా తెలుసుకొనే అవకాశం బీజేపీ నాయకులకు కలిగింది. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తామని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని పాదయాత్ర ద్వారా పేదల్లో ఆత్మస్థైర్యం నింపగలిగామని సంజయ్ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో  కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌లకు అవకాశం వచ్చిందనీ వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేలా సహాయ, సహకారాలు అందించాలని సంజయ్ చేసిన వినతులకు ప్రజల నుంచి సానుకూల స్పందనలు లభించాయి. “ ఒకసారి మాకు అవకాశమిస్తే మార్పు చూపిస్తాం” అంటూ ప్రజల్లో భరోసా కలిగించడానికి కూడా ఈ పాదయాత్ర ఎంతగానో ఉపయోగపడింది. కేసీఆర్‌‌‌‌ సర్కార్‌‌‌‌ నియంతృత్వ ధోరణులు, అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ ఆధిపత్యంతో కూడిన అవినీతిమయ పాలనను ఎండగట్టేందుకు ఈ పాదయాత్ర విశేషంగా తోడ్పడింది. 

భవిష్యత్ కు ప్రణాళిక..

2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే అమలు చేయాల్సిన కార్యక్రమాలేంటో సంజయ్​పాదయాత్ర ద్వారా తెలిశాయి. ఆచరణయోగ్యమైన, తెలంగాణ ప్రజలకు అత్యవసరమైన అంశాలతో 2023 ఎన్నికల ప్రణాళికను రూపొందించుకునే అవకాశం సంగ్రామ యాత్ర కల్పించింది. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకొనే వచ్చే రెండున్నరేళ్లలో పార్టీ చేపట్టాల్సిన ప్రజా ఉద్యమాలపై స్పష్టత వచ్చింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా హుస్నాబాద్ బహిరంగసభలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజల పక్షాన భవిష్యత్తులో చేసే పోరాటాలు వివరిస్తారు. ఈ పాదయాత్ర సందర్భంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి, 
సంక్షేమ కార్యక్రమాల గురించి నేరుగా ప్రజలతో సంజయ్ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రంలో వ్యవసాయానికి, రైతులకు అందుతున్న సాయం, హరితహారం, ఇతర పథకాలకు అందుతున్న నిధులను ప్రజలకు తెలియజెప్పారు. డబుల్‌‌‌‌ బెడ్‌‌‌‌రూం ఇండ్లకు కేంద్రం నిధులిచ్చినా టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం సరిగా ఖర్చు చేయకపోవడాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.  కరోనా మహమ్మారి సమయంలో కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయాన్ని కూడా వివరించారు. వివిధ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా కేంద్రం నుంచి మరిన్ని నిధులను రాష్ట్ర ప్రభుత్వం రాబట్టలేక పోతున్నట్లు ప్రజలకు చెప్పారు. పలు వర్గాల ప్రజలు కేసీఆర్, మోడీ పాలనలను పోల్చి చూస్తున్నట్లు సంజయ్​గమనించారు. ఫామ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ పాలన, క్లిష్ట సమస్యలను అనితర సామర్థ్యంతో మోడీ ఎదుర్కొంటున్న తీరుతెన్నులను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఈ పాదయాత్ర ద్వారా వెల్లడైంది.

- డా. జి. మనోహర్ రెడ్డి,

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు