- 30 రోజులు సమావేశాలు నిర్వహించాలె: పాయల్ శంకర్
- అసెంబ్లీ ఆవరణలో బీజేఎల్పీ మీటింగ్.. ఐదుగురు ఎమ్మెల్యేలు హాజరు
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ చెప్పారు. అసెంబ్లీ సమావేశాలను తూతూ మంత్రంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోందని విమర్శించారు. ప్రజాసమస్యలు ప్రస్తావించే విధంగా 30రోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీ ఆవరణలో బీజేఎల్పీ సమావేశం తర్వాత పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 20, 25 అంశాలను అసెంబ్లీలో ప్రస్తావిస్తామని వెల్లడించారు.
రైతులు, నిరుద్యోగులు, శాంతిభద్రతలు, మూసీ, హైడ్రా, జీవో 317 తదితర సమస్యలతో పాటు ప్రజా సమస్యలను లేవనెత్తుతామన్నారు. కాంగ్రెస్ ఏడాది కాలంలో ఏదో సాధించినట్టు గొప్పలు చెప్పుకుంటోందని, ఇచ్చిన హామీలను మరిచిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే తీరు కూడా సరిగా లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల ఎజెండా గురించి ఇప్పటివరకూ సమాచారం ఇవ్వలేదన్నారు. ఎన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, హారీశ్, సూర్యనారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.
దిశానిర్దేశం చేసే వారే కరువు..
జాతీయ పార్టీగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపై దిశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. బీజేఎల్పీ మీటింగ్ కు ఆదివారం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. కూతురు వివాహ ఏర్పాట్లలో ఉన్నందున బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఇతర కారణాలతో రాజాసింగ్, రాకేశ్ రెడ్డి హాజరు కాలేదు. కీలకమైన ఎల్పీ నేత అందుబాటులో లేకపోవడంతో వారికి దిశానిర్దేశం చేసే వారే కరువయ్యారు. ఏ పార్టీ అయినా ఎల్పీ సమావేశం నిర్వహిస్తే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లేదా కీలక నేతలు అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలనే దానిపై ఎమ్మెల్యేలకు సలహాలు, సూచనలు చేస్తుంటారు. కానీ పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డితో సహా జాతీయ నేతలు ఎవ్వరూ ఈ సమావేశానికి అంటెండ్ కాలేదు. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది.