
- లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నయ్?.. వర్సిటీ వీసీ నుంచి వివరాలు సేకరించిన బీజేపీ ఎంపీలు
- హెచ్‌సీయూపై కేటీఆర్‌కు అంత ప్రేమ ఉంటే.. టీఎన్జీవోలకు అక్కడ భూమెట్ల ఇచ్చిన్రు?: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
- పవర్లో ఉన్నప్పుడు ల్యాండ్స్‌ను వర్సిటీకి ఎందుకు రాసియ్యలే అని నిలదీత
- సుద్దపూస మాటలు మానుకోవాలని సూచన
- కంచ గచ్చిబౌలి ఇష్యూలో ఉన్న ఎంపీ ఎవరో కేటీఆరే చెప్పాలి: రఘునందన్‌రావు
- వర్సిటీ భూముల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టాలని ప్రభుత్వానికి డిమాండ్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై వర్సిటీ వీసీ నుంచి బీజేపీ ఎంపీలు వివరాలు సేకరించారు. బుధవారం వర్సిటీ వీసీ జగదీశ్వర్ రావు, రిజిస్ట్రార్ దివేశ్ నిగమ్ తో ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్ తదితరులు సమావేశమయ్యారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో భేటీ జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్సీయూకు ఎంత భూమి కేటాయించింది? ఆ భూమి వర్సిటీ పేరుతో ట్రాన్స్ఫర్ అయిందా? ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లో ఎవరి పేరుతో ఉంది? అందులో ఎంత కబ్జాకు గురైంది? సర్వే చేసే అవకాశాలున్నయా? లీగల్ డాక్యుమెంట్లు ఏమున్నయ్? అని వీసీని ఎంపీలు అడిగి తెలుసుకున్నారు. వర్సిటీ అధికారుల వద్ద ఉన్న లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు.
134 ఎకరాలను టీఎన్జీవోస్కు బీఆర్ఎస్ ఇచ్చింది: కొండా
హెచ్సీయూకు 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే భూములు ఇచ్చిందని ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మీడి యాతో అన్నారు. ఆ భూముల్లో కొంత భూమిని తిరి గి తీసుకోవడంతో పాటు గచ్చిబౌలి స్టేడియానికి, ఎంఆర్ఓ ఆఫీస్‌కు, నవోదయ స్కూల్‌కు, మున్సిపల్ ఆఫీసుకు కేటాయించారని కొంత భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందని తెలిపారు. ఈ నేపథ్యం లో వర్సిటికీ ఎన్ని ఎకరాలు ఉందనే వివరాలను తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ‘‘సెంట్రల్ వర్సిటీ భూము లను తామే కాపాడుతున్నట్టుగా కేటీఆర్ సుద్దపూస మాటలు మాట్లాడుతున్నడు. కానీ, వర్సిటీ భూముల్లోంచి 134 ఎకరాలను కేసీఆర్ టీఎన్జీవోలకు ఇచ్చింది నిజం కాదా? నిజంగా బీఆర్ఎస్ కు వర్సిటీ పై ప్రేమ ఉంటే.. ఆ రోజే(బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు) ఆ భూములను వర్సిటీకి రాసిచ్చేవారు. టీఎన్జీఓల కోసం భూమి ఇచ్చి అక్కడ రోడ్డు వేస్తే.. దానిపై వర్సి టీ కోర్టుకు పోయింది” అని ఆయన తెలిపారు.
ఈ ఎంపీ ఎవరో కేటీఆర్ చెప్పాలి: రఘునందన్
2012లో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ 2,185 ఎకరా లు హెచ్సీయూకు చెందినదేనంటూ సీసీఎల్ఏకు లేఖ రాశారని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ భూమిపై సుప్రీంకోర్టులో రేవంత్ కొట్లడింది ఎప్పుడో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. హెచ్ సీయూకు 2,185 ఎకరాల భూములు ఇస్తే సరిపోతుందని తెలిపారు. వివాదాస్పదంగా ఉన్న 400 ఎకరాలను పక్కన పెట్టి.. 1,785 ఎకరాల భూమికి గత పదేండ్లలో ఎందుకు ప్రహరీ కట్టలేదో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీ యూ ల్యాండ్ కేసులో బీజేపీ ఎంపీ ఉన్నారని కేటీఆర్ చేసిన కామెంట్లపై మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆ ఎంపీ ఎవరో చెప్తే పార్టీ తరఫున సమాధానమిస్తం” అని రఘునందన్ అన్నారు. వర్సిటీ అంశాన్ని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు.