- కార్యకర్తల్లో జోష్ నింపిన నాయకులు
- కాషాయమయమైన ఆదిలాబాద్ పట్టణం
ఆదిలాబాద్‌టౌన్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం బీజేపీ నిర్వహించిన జనగర్జన జనసంద్రంలా మారింది. డైట్కాలేజీ మైదానానికి పలు జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. దారులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. భద్రత, ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని పోలీసులు పట్టణం నుంచి 6 కిలో మీటర్ల దూరంలోని మావల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో ప్రజలు అక్కడి నుంచి కాలినడకన సభకు తరలివచ్చారు.
బీజేపీతోనే అభివృద్ధి
సభలో పాల్గొన్న ఎంపీ సోయం బాపూరావు మాట్లాడుతూ బీజేపీతోనే అభివృద్ధి సాధ్యపడుతుందని అన్నారు. ఎన్నికలు ప్రకటించిన 5 రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. రూ.5 వేల కోట్ల కేంద్ర నిధులతో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను అగ్రగామిగా చూడాలని కోరుకుంటోందని.. కానీ సిమెంటు ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం, రైల్వే లైన్ మంజూరు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించక పోవడం వల్లే ఆలస్యమవుతున్నాయని ఫైర్అయ్యారు.
ఆదిలాబాద్‌కు ఎమ్మెల్యే జోగు రామన్న చేసిందేమీ లేదని, ప్రజలు పడుతున్న బాధలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. అక్రమంగా సంపాదించిన వందల కోట్ల రూపాయలను పంచడానికి జోగు రామన్న సిద్ధమవుతున్నాడని, ఆ డబ్బంతా ఆదిలాబాద్ప్రజలదేనని మండిపడ్డారు. ప్రజలు ఇకనైనా ఆయనకు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా, వందల కేసులు పెట్టినా తాము ప్రజల కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
‘బండి’పై కొండంత అభిమానం
బహిరంగ సభ ముగిసిన వెంటనే బండి సంజయ్ ను అభిమానులు చుట్టుముట్టారు. ‘బండి సంజయ్ జిందాబాద్, హిందూ టైగర్ జిందాబాద్’ అంటూ సభా వేదిక వద్ద నుండి భుజాలపైకి ఎక్కించుకుని బైటకు తీసుకొచ్చారు. సంజయ్‌ను చూసేందుకు జాతీయ రహదారిపై జనం బారులు తీరారు. రోడ్డుకు ఇరువైపులా నిలుచున్న ప్రజలకు అభివాదం చేస్తూ సంజయ్ ముందుకు సాగారు. కళాజాత బృందం వారు పాడిన ‘ఆదిలాబాద్గడ్డ మీద బీజేపీ జెండా’ పాటకు కార్యకర్తలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సభా ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు రోడ్లమీద నుంచే నాయకులు ప్రసంగాలను వింటూ నినాదాలు చేశారు.