నల్గొండ, వెలుగు: మునుగోడులో ఎన్నికల ప్రచారం స్పీడ్ పెంచాలని, దసరా తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయాలని బీజేపీ ఎన్నికల కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. మంగళవారం మర్రిగూడలోని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు ఆఫీసులో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన మండల ఎన్నికల ఇన్‌చార్జ్‌లతో మీటింగ్ జరిగింది. లీడర్లు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మునుగోడు ఎన్నిక కో ఆర్డినేటర్ గంగిడి మనోహర్‌రెడ్డి, మునుగోడు ఎన్నిక కమిటీ కన్వీనర్ దుగ్యాల ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దసరా లోపు బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసి.. ఈ కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయించారు.
పోస్టర్లు పంపిణీ చేయడం, కులాల వారీగా మీటింగులు పెట్టడం, దళిత, గిరిజన వాడల్లో, బస్తీల్లో పర్యటించడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది సమన్వయ కమిటీలు మునుగోడు ఎన్నికలకు సంబంధించి బీజేపీ సంస్థాగత నిర్మాణం దాదాపు పూర్తయింది. పార్టీలోని పాత లీడర్లతో పాటు కొత్తగా చేరిన లీడర్లను కలిపి మండల సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. బీజేపీలో రాజగోపాల్‌రెడ్డి చేరిన తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి సమన్వయ కమిటీల్లో ప్రాధాన్యం ఇచ్చారు. పాత, కొత్త లీడర్లు కలిసి పని చేసేలా దిశానిర్దేశం చేస్తున్నారు. ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు సంబంధించి తొమ్మిది సమన్వయ కమిటీలను నియమించారు. ఒక్కోదాంట్లో పది మంది మెంబర్స్ఉంటారు.
ఇప్పటికే మునుగోడు పరిధిలోని అన్ని మండలాలకు వివిధ జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నాయకులను ఇన్‌చార్జ్‌లు, సహ ఇన్‌చార్జ్‌లను పార్టీ హైకమాండ్ నియమించింది. కొత్తగా ఏర్పాటైన సమన్వయ కమిటీలు.. మండల ఎన్నికల ఇన్‌చార్జ్‌ల కోఆర్డినేషన్‌తో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాయి. కొత్తగా నియమించిన ఈ కమిటీలకే ఎన్నికల ప్రచార బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ కమిటీలో ఉన్న పదిమందిలో ఎవరికీ పదవులు, హోదాలు ఉండవు. అందరూ సభ్యులే. వీరే మండలంలో ప్రచార కార్యక్రమాలు రూపొందిస్తారు. పార్టీలోకి చేరికలు, అభ్యర్థి పర్యటనలను కమిటీలు డిసైడ్ చేస్తాయి. గ్రామ కమిటీలకు బదులు బూత్ స్థాయి కమిటీలు కూడా వేస్తారు. ఒక్కో బూత్ కమిటీలో పది మంది సభ్యులు ఉంటారు. పెద్ద బూత్ కమిటీల్లో 20 మంది సభ్యులను నియమించనున్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ యువతకు ఆదర్శం
చండూరు (మర్రిగూడ), వెలుగు: తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప ఉద్యమకారుడని, నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి అన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడలో మంగళవారం మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆఫీస్‌లో కొండా లక్ష్మణ్ జయంతి వేడుకలు జరిగాయి. వివేక్ వెంకటస్వామి, జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి తదితరులు బాపూజీ ఫొటోకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి లక్ష్మణ్ బాపూజీ అని వివేక్ కొనియాడారు. 1969 ఉద్యమంలో ఆయన క్రియాశీలంగా ఉన్నారని, అరెస్టులకు భయపడకుండా పోరాడారని చెప్పారు. బాపూజీ పోరాటం గురించి తన తండ్రి వెంకటస్వామి ఎప్పుడూ చెబుతుండే వారని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించడానికి కూడా కేసీఆర్‌కు టైం దొరకలేదని, మునుగోడు ఎన్నికలు వస్తున్నాయనే కొండా లక్ష్మణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయన జయంతిని నిర్వహిస్తున్నారని విమర్శించారు. 8 ఏండ్ల నుంచి గుర్తుకు రాని కొండా లక్ష్మణ్ ఇప్పుడు ఎలా యాదికొచ్చారని ప్రశ్నించారు. నాంపల్లి, మల్లెపురాజు పల్లి, మెల్లవాయి, నరసింహులగూడేనికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు 500 మంది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు.